కరోనా వైరస్ ధాటికి స్టాక్ మార్కెట్లు భారీ కుదుపులకు లోనైన కారణంగా కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబానీ ఆస్తులు 28 శాతం తగ్గి 48 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఈ రెండు నెలల్లో ఆయన ఆస్తులు రోజుకు 300 మిలియన్ డాలర్లు చొప్పున క్షీణించినట్లు తెలిపింది.
ఎనిమిది స్థానాలు దిగజారి..
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం, ముకేశ్ అంబానీ సంపద 19 బిలియన్ డాలర్లు క్షీణించింది. ఫలితంగా ప్రపంచ ధనవంతుల జాబితాలో ఆయన ఎనిమిది స్థానాల దిగువకు పడిపోయి 17వ ర్యాంకుకు చేరుకున్నారు.
తరిగిపోతున్న సంపద
గౌతమ్ అదానీ సంపద 37 శాతం తరిగిపోయి 6 బిలియన్ డాలర్లకు చేరగా.... హెచ్సీఎల్ టెక్నాలజీస్ శివ నాడార్ సంపద 26 శాతం క్షీణించి 5 బిలియన్ డాలర్లకు చేరుకుందని నివేదిక వెల్లడించింది. ఉదయ్ కొటక్ సంపద 28 శాతం పడిపోయి 4 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ముగ్గురూ టాప్ 100 ప్రపంచ ధనవంతుల జాబితా నుంచి వైదొలగగా... ముకేశ్ ఒక్కరే టాప్ 100లో కొనసాగుతున్నారు.