పన్ను చెల్లింపుల సమయంలో ఇక నుంచి ఆధార్ కార్డు వివరాలను పొందుపరిస్తే సరిపోతుంది. ఆధార్ కార్డుతో అనుసంధానమైన పాన్ కార్డు వివరాలను ఆదాయపు పన్ను శాఖ తనంతట తానే సేకరిస్తుంది. ఈ విధానం సెప్టెంబర్ 1 నుంచి అమలవుతున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డు (సీబీడీటీ) తెలిపింది.
ఐటీ చట్టంలోని 139 ఏఏ(2) ప్రకారం 2017 జులై 1 లోపు పాన్ కార్డు ఉన్న వ్యక్తి ఆధార్ పొందేందుకు అర్హుడు. ఆధార్ వచ్చాక ఆ వివరాలను ఐటీ శాఖతో పంచుకోవాలి. ఐటీ రిటర్న్ దాఖలు చేసేందుకు ఆధార్ కార్డు అనుసంధానం రాజ్యాంగబద్ధంగా అంగీకారమేనని, అందుకు బయోమెట్రిక్ ఐడీ తప్పనిసరని గతేడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు కొత్త విధానాన్ని ప్రకటించింది సీబీడీటీ.
"ఎవరైనా పాన్ కార్డు లేకుండా కేవలం ఆధార్ కార్డుతోనే ఐటీ రిటర్న్ దాఖలు చేస్తే.. వారికి సుమోటోగా పాన్ కార్డు దరఖాస్తు వచ్చేస్తుంది. అంటే వాళ్లకు ఆధార్ ఉంటే మేం పాన్ కార్డు ఇస్తాం. పాన్, ఆధార్ అనుసంధానం తప్పనిసరి."