ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఐదో, ఆఖరి విడత ప్యాకేజీలో భాగంగా వైద్య రంగానికి పలు ఉద్దీపనలు ప్రకటించారు. భవిష్యత్లో దేశంలో కరోనా లాంటి అంటువ్యాధులు ప్రబలినా... ఎదుర్కొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
అలాగే రానున్న రోజుల్లో ప్రజా ఆరోగ్య పరిరక్షణకు పెట్టుబడులు పెంచనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల సంఖ్యను పెంచుతామని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో సైతం ఆసుపత్రుల ఏర్పాటుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ప్రతి జిల్లాలోనూ సాంక్రమిక వ్యాధుల ప్రత్యేక విభాగం, మండల స్థాయిలో ప్రజారోగ్య ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. భవిష్యత్లో ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో వైద్య సదుపాయాల కల్పనకు కృషిచేస్తామని తెలిపారు.
పరిశోధనలకు ఊతం
వైద్య రంగంలో పరిశోధనలకు గాను ఐసీఎమ్ఆర్ ద్వారా అదనపు నిధులు, ప్రోత్సాహం అందిస్తామని నిర్మలా సీతారామన్ వివరించారు. జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్ ద్వారా ఆరోగ్య సేవలు మరింత విస్తృతం చేస్తామని ఆమె తెలిపారు.