కొవిడ్(Covid-19) బాధితులకు ఊరట కలిగించే పరిణామమిది. ఏప్రిల్ మధ్య నుంచి విపరీతంగా పెరిగిన మెడికల్ ఆక్సిజన్(Oxygen), కాన్సన్‌ట్రేటర్ల ధరలు గణనీయంగా దిగివచ్చాయి. కేసులు తగ్గుముఖం పట్టడం, ఆక్సిజన్ అందుబాటు సదుపాయాలు మెరుగవ్వడం ఇందుకు కారణమని చెబుతున్నారు. పెద్ద సిలిండర్ రీఫిల్లింగ్ ధర రూ.2,000-3,000 నుంచి రూ.600కు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల ధర రూ.60,000-70,000 నుంచి రూ.15,000-25,000కు తగ్గాయి.
కొవిడ్(Covid-19) మహమ్మారి మొదటిదశ కంటే రెండో దశలో బాధితులకు ఆక్సిజన్(Oxygen) అవసరాలు బాగా పెరిగాయి. ఆస్పత్రులకు సిలిండర్లలో సరఫరా అయ్యే మెడికల్ ఆక్సిజన్ ధరతో పాటు, ఇంటి వద్ద స్వల్ప స్థాయిలో ఆక్సిజన్ వినియోగించుకునేందుకు దోహదపడే కాన్సన్‌ట్రేటర్ల ధరలూ కొన్నిరెట్ల మేర ఎక్కువయ్యాయి. ఆక్సిజన్ శాచురేషన్ (ఎస్‌పీఓ2) స్థాయులు 90 కంటే తగ్గిన వారికి కనీసం నిమిషానికి 5 లీటర్ల సామర్థ్యంతో మెడికల్ ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి. ఈ సదుపాయం ఉన్న పడక కోసం ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు రూ.20,000-30,000 కూడా వసూలు చేశారు. వాస్తవానికి ఏప్రిల్ మొదటివారం వరకు 150 క్యూబిక్ మీటర్ మెడికల్ ఆక్సిజన్ ఉండే పెద్ద సిలిండర్‌ను నింపి ఇచ్చేందుకు తయారీ సంస్థలు రూ.350 మాత్రమే తీసుకునేవి. గిరాకీ పెరిగి పోవడంతో ఏప్రిల్ మధ్య నుంచి రూ.600 తీసుకోవడం ప్రారంభించాయి. అదేనెల 20 కల్లా రూ.1,000కు, మే మొదటి వారానికల్లా రూ.2,500-3,000కు కూడా ఈ ధర ఎగబాకింది. అదీ అవసరానికి లభ్యం కాక ఎందరో ప్రాణాలు కోల్పోయారు.
గిరాకీ తగ్గి..
కేసులు తగ్గుముఖం పడుతుండటానికి తోడు... విశాఖ ఉక్కు, మేఘా ఇంజినీరింగ్ వంటి సంస్థలు ఆస్పత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నాయి. ఆక్సిజన్ సరఫరాకు కావాల్సిన ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్రైవేటు సంస్థలు కూడా రీఫిల్లింగ్ ఛార్జీలను తగ్గిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆస్పత్రుల్లో వినియోగించే పెద్ద సిలిండర్ రీఫిల్లింగ్‌కు హైదరాబాద్‌లో కనిష్ఠంగా రూ.600, గరిష్ఠంగా రూ.1000 వసూలు చేస్తున్నారు.
100 నుంచి 30 సిలిండర్లకు..
ఈ నెల మొదటి వారంలో ఆక్సిజన్ పడకలు, బైపాప్-వెంటిలేటర్లతో కూడిన 30 పడకలున్న ఆస్పత్రికి రోజుకు 100 వరకు పెద్ద ఆక్సిజన్ సిలిండర్లు అవసరమయ్యేవి. ఇప్పుడు సిలిండర్ల అవసరాలు కూడా రోజుకు 30-40 శాతానికి తగ్గిపోయాయని హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రి నిర్వాహకుడు తెలిపారు. అయితే ఆక్సిజన్ రీఫిల్లింగ్ ఛార్జీలపై అవగాహన లేనివారి నుంచి తయారీ సంస్థలు కొంత అధికంగా వసూలు చేస్తుండగా, రోగుల నుంచి ఆస్పత్రుల వారు కూడా ఇంకా ఎక్కువ మొత్తాల్లోనే ఆక్సిజన్ ఛార్జీలు వసూలు చేస్తుండటం గమనార్హం.