ఎయిర్ఇండియా యాజమాన్యం మారినప్పటికీ దాని వారసత్వం మాత్రం చెక్కుచెదరదని ఆ సంస్థ చీఫ్ అశ్వని లొహానీ అన్నారు. ఎయిర్ఇండియా ఆధ్వర్యంలో 'సొసైటీ ఫర్ కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్' నిర్వహిస్తున్న ఐదు రోజుల ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా లొహానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విమానయాన సంస్థను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో లొహానీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
దివంగత జేఆర్డీ టాటా ప్రారంభించిన ఎయిర్ఇండియా విమానయాన సంస్థ భారీగా నష్టపోయింది. అయినప్పటికీ ఎయిర్ఇండియా ఇప్పటికీ చాలా గొప్ప సంస్థేనని లొహానీ పునరుద్ఘాటించారు. సాటిలేని వారసత్వం దాని సొంతమన్నారు.
"ఒక సంస్థగా ఎయిర్ఇండియా చాలా బలంగా ఉంది. ఈ రోజుకి కూడా అసమానతలు ఉన్నప్పటికీ మేము మా కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. దేశానికి అవసరమైన ప్రతిసారి ఎయిర్ఇండియా ముందుంది. చైనాను కొవిడ్-19 అతలాకుతలం చేస్తుంటే.. అక్కడ ఒంటరిగా మిగిలిపోయిన భారతీయులను 'ఎయిర్ఇండియా'నే తీసుకొచ్చింది."
- అశ్వని లొహానీ, ఎయిర్ఇండియా చీఫ్
దానికీ, దీనికీ సంబంధం లేదు..
ఎయిర్ఇండియా ప్రైవేటీకరణకు, తాజాగా నిర్వహిస్తున్న ప్రదర్శనకు ఎలాంటి సంబంధం లేదని లొహానీ స్పష్టం చేశారు. 'ప్రదర్శన నిర్వహించాలని సొసైటీ ఫర్ కల్పర్ అండ్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శి మీరాదాస్ మమ్మల్ని సంప్రదించారు. అందుకు మేము మా మద్దతిచ్చాం.' అని లొహానీ స్పష్టం చేశారు.
ప్రైవేటీకరణ దిశగా
నష్టాల్లో ఉన్న ఎయిర్ఇండియాను ప్రైవేటీకరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినప్పటికీ... గతేడాది ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐలకు పూర్తి యాజమాన్యంలో సహా, ఏ ప్రైవేటు పార్టీకైనా విమానయాన సంస్థలో 100 శాతం ఈక్విటీని విక్రయించడానికి కేంద్రం అనుమతించింది.
2007-08లో తీవ్ర నష్టాల్లో ఉన్న ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను ఎయిర్ఇండియాలో విలీనం చేసింది. అప్పటి నుంచి సంస్థకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. లాభం రాకపోగా.. నష్టాల్లో కూరుకుపోయింది. ఫలితంగా ఎయిర్ఇండియాకు మొత్తం 60 వేల కోట్ల రూపాయల వరకు అప్పు ఏర్పడింది. అయితే విక్రయ ప్రక్రియను సులభతరం చేయడానికి కొత్తగా హోల్డింగ్ కంపెనీని సృష్టించిన తరువాత ఎయిర్ఇండియా అప్పులు రూ.23,000 కోట్లకు దిగొచ్చాయి.
ఇదీ చూడండి:వృద్ధి భయాలతో.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు