తెలంగాణ

telangana

ETV Bharat / business

'డిజిటల్‌'దే ప్రపంచం.. నైపుణ్యాలున్న వారికి భారీ గిరాకీ

future is digital: కరోనా మన జీవితాల్ని పూర్తిగా మార్చేసింది. మనం జీవించే పద్ధతులు, చేసే పని వాతావరణంలో సమూలంగా మార్పులు తెచ్చింది. ప్రపంచం తిరిగి కరోనా ముందు పరిస్థితులకు వెళుతుందని అంటున్నారు నిపుణులు. అయితే మనం ఇప్పటికే 'డిజిటల్‌ ఫస్ట్‌' జీవితానికి అలవాటు పడ్డామని... గత 18 నెలలుగా మన జీవితాల్లో ప్రతి అంశం డిజిటలీకరణకు లోనైందని చెప్తున్నారు.

future is digital
డిజిటల్​

By

Published : Jan 2, 2022, 7:45 AM IST

future is digital: 2021 కాలగర్భంలో కలిసిపోయింది. కరోనా కారణంగా గత ఏడాది వ్యక్తులు, కంపెనీలకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కొవిడ్‌ రెండో దశ సమయంలో ప్రభుత్వం, పరిశ్రమ, ఆసుపత్రులతో పాటు అందరూ ఎంత ప్రయత్నించినా.. చాలా విలువైన ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. ఒమిక్రాన్‌ రూపంలో కొవిడ్‌ భయపెడుతున్నా, ఇపుడు మెరుగైన స్థానంలో, సమయంలో ఉన్నామని ఆశిద్దాం.

సవాళ్ల నుంచే మన దేశానికి అవకాశాలు

ప్రపంచం క్రమంగా కరోనా ముందు స్థాయిలకు చేరడానికి ప్రయత్నిస్తూ ఉంది. కరోనా సృష్టించిన సరఫరా వ్యవస్థ సవాళ్ల ప్రభావం కింద ఇంకా పలు పరిశ్రమలు నలిగిపోతూనే ఉన్నాయి. వివిధ విడిభాగాలకు చైనాపై అధికంగా ఆధారపడడం ఇందుకు కారణమని చెప్పాలి. ఎదురైన సవాళ్లతో భారత్‌, అమెరికాతో పాటు వివిధ దేశాలు వివిధ తయారీ విడిభాగాలకు (సెమీకండక్టర్లు సహా) ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకునే ప్రక్రియలో ఉన్నాయి. బహుళజాతి కంపెనీలన్నీ చైనాతో పాటు ఇంకో దేశం (చైనా+1)పైనా ఆధారపడేలా వ్యూహాన్ని తమ తయారీ, సరఫరా వ్యవస్థలకు అన్వయించుకోవడాన్ని ప్రారంభించాయి. భారత్‌, వియత్నాం, మలేషియా, తైవాన్‌ వంటి వాటిని ఇందుకు ఎంచుకుంటున్నాయి. 'ప్రతి సంక్షోభంలో ఒక అవకాశం దాగి ఉంటుంద'న్నది చైనా సామెత. బలమైన తయారీ కేంద్రాన్ని నిర్మించడానికి భారత్‌కు ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం.

డిజిటల్‌కు మారడం తప్పనిసరి

కరోనా మన జీవితాల్ని పూర్తిగా మార్చేసింది. మనం జీవించే పద్ధతులు, చేసే పని వాతావరణంలో సమూలంగా మార్పులు తెచ్చింది. ప్రపంచం తిరిగి కరోనా ముందు పరిస్థితులకు వెళుతుందని బలంగా ఆశిద్దాం. అయితే మనం ఒక 'డిజిటల్‌ ఫస్ట్‌' జీవితానికి సిద్ధపడాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. గత 18 నెలలుగా మన జీవితాల్లో ప్రతి అంశం డిజిటలీకరణకు లోనైంది. నిత్యావసరాలు, ఔషధాలను ఆన్‌లైన్‌లో కొనడం.. సినిమాలను ఓవర్‌ ద టాప్‌ (ఓటీటీ) ప్లాట్‌ఫారాల్లో చూడటం.. సమావేశాలను హైబ్రిడ్‌ విధానం (ఫిజికల్‌+డిజిటల్‌)లో నిర్వహించడం వరకు.. ఉపాధ్యాయుల బోధనను చిన్నారులు కూడా మొబైల్‌ నుంచే ఆలకించడం .. ఇలా అన్నీ 'డిజిటలైజ్‌' అయ్యాయి.

బోధనా సిబ్బంది కంప్యూటర్‌ నైపుణ్యాలు

ప్రత్యక్షంగా 100 మంది కంటే ఎక్కువ లేని చాలా కార్యక్రమాలకు నేనే సాక్షిని. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్‌ఎస్‌ టీమ్స్‌, వెబ్‌ఎక్స్‌ వంటి ప్లాట్‌ఫారాలను విస్తృతంగా వినియోగించుకోవడానికి అలవాటు పడాల్సి వస్తోంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా హైబ్రిడ్‌ క్లాసు రూములకు సంసిద్ధంగా ఉండాలి. టీసీఎస్‌, సైయెంట్‌ వంటి కంపెనీలు, కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌(కిట్స్‌) వరంగల్‌ వంటి సంస్థల సహకారంతో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) 1000 మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రాథమిక కంప్యూటర్‌ విద్యను నేర్పింది. ఆన్‌లైన్‌ తరగతులను ఇబ్బంది లేకుండా నిర్వహించేలా చేసింది. హైబ్రిడ్‌ పద్ధతిలో జీవించాలన్నా, నేర్చుకోవాలన్నా, పనిచేయాలన్నా.. దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామాల్లో నెట్‌వర్క్‌ కనెక్టివిటీ, బ్యాండ్‌విడ్త్‌ అత్యంత ముఖ్యం.

ప్రభుత్వం, కంపెనీలు, విద్యా సంస్థలు, వ్యక్తులు.. ఇలా ప్రతి ఒక్కరికి ఇవాళ 'డిజిటల్‌' అనేది 'తప్పనిసరి'గా మారిపోయింది. ఈ కీలకాంశమే సాంకేతిక రంగంలోని నైపుణ్యం ఉన్న మానవ వనరులకు భారీ గిరాకీని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డేటా అండ్‌ ఇన్‌సైట్స్‌, 4జీ/5జీ, నెక్ట్స్‌ జనరేషన్‌ ఆర్కిటెక్చర్స్‌, కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌, సైబర్‌ భద్రత వంటి డిజిటల్‌ నైపుణ్యాలున్న వారికి గిరాకీ పెరిగింది.

ఐటీలో రెండంకెల వృద్ధి

2021-22లో భారత ఐటీ పరిశ్రమ రెండంకెల వృద్ధి నమోదు చేస్తుందన్న అంచనాలున్నాయి. ఈ వృద్ధికి నైపుణ్యం ఉన్న ఇంజినీర్లే ముఖ్యం. అందువల్లే క్యాంపస్‌ (కళాశాల ప్రాంగణం)ల్లో అధికంగా, మరికొంతమంది అనుభవజ్ఞులను మార్కెట్‌ నుంచి కంపెనీలు నియమించుకుంటున్నాయి. మార్కెట్‌ వాటాను పెంచుకోవాలంటే నైపుణ్యాభివృద్ధి, శిక్షణపై కంపెనీలు దృష్టిని కొనసాగించాల్సిందే.

అనిశ్చితి లేని ప్రపంచం; తప్పనిసరిగా మారిన డిజిటల్‌ ప్రపంచం.. మనల్ని మెరుగైన, నాణ్యమైన జీవితం వైపు అడుగు వేయించేందుకు 2022 వేదిక అవుతుందని ఆశిద్దాం.

- వీ.రాజన్న, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, గ్లోబల్‌ హెడ్‌, టెక్నాలజీ బిజినెస్‌ యూనిట్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌

ఇదీ చూడండి:న్యూఇయర్‌ వేళ.. నిమిషానికి 9000 ఫుడ్‌ ఆర్డర్లు

ABOUT THE AUTHOR

...view details