కష్టాల్లో ఏకతాటిపై నిలిచి సంక్షోభాలను అధిగమిస్తూ బలమైన బంధానికి పెట్టింది పేరుగా నిలిచిన చమురు ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్)లో పొరపొచ్చాలు బయటకు పొక్కాయి. సభ్యదేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సౌదీ అరేబియా మధ్య చమురు ఉత్పత్తి పెంపు విషయంలో విభేదాలు తలెత్తాయి. దీంతో వచ్చే నెల చమురు ఎగుమతులపై ప్రతిష్టంభన నెలకొంది. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరకపోతే ఆగస్టులో చమురు ధరల సంక్షోభం రావొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.
ఎవరి వాదన ఏమిటి?
వచ్చే నెలతో పాటు ఈ ఏడాది చివరి వరకు చమురు ఉత్పత్తిపై నిర్ణయం తీసుకునేందుకు ఒపెక్, రష్యా సహా ఇతర చమురు ఎగుమతి దేశాలు ఇప్పటికే రెండు సార్లు భేటీ అయ్యాయి. కానీ, కూటమిలోని ప్రధాన భాగస్వామ్య దేశాలైన యూఏఈ, సౌదీ మధ్య సయోధ్య కుదరకపోవడం వల్ల వాయిదా పడింది. వచ్చే నెల చమురు ఉత్పత్తిని మరో 20 మిలియన్ బ్యారెళ్ల మేర పెంచాలని సౌదీ ప్రతిపాదించింది. అలాగే, గతంలో నిర్ణయించినట్లు 2022లోనూ ఉత్పత్తిపై ఆంక్షలు కొనసాగించాలని తెలిపింది. ఈ రెండు ప్రతిపాదనల్లో వచ్చే నెల నుంచి చమురు ఉత్పత్తి పెంపునకు యూఏఈ అంగీకరించింది. కానీ, ఉత్పత్తిపై ఆంక్షల గడువు పొడిగింపునకు మాత్రం ససేమిరా అంటోంది. ప్రపంచవ్యాప్తంగా చమురుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇదే అదును చూసుకుని లాభాలను ఒడిసిపట్టాలని సౌదీ భావిస్తోంది. కానీ, యూఏఈ మాత్రం దిగుమతి దేశాల అవసరాలను బట్టి వాటితో మెరుగైన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సభ్య దేశాలకు అవకాశం కల్పించాలని కోరుతోంది. యూఏఈ అంగీకారం లేకుండా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని సౌదీ చెబుతుండడం గమనార్హం. మరోవైపు సౌదీ నిర్ణయాన్ని రష్యా సహా కూటమిలోని ఇతర దేశాలు కూడా అంగీకరించాయి.
యూఈఏ అభ్యంతరాలేంటి?