ఉత్పత్తుల దేశీయ మూలాలను ప్రదర్శించేందుకు ఆన్‌లైన్ విక్రయ వేదికలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అంగీకరించాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పరిశ్రమ వర్గాలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాయని వెల్లడించాయి.
ప్రభుత్వ ఈ-మార్కెట్ వెబ్‌సైట్‌లో ఇకపై విక్రయించే ఉత్పత్తుల దేశీయ మూలాలను ప్రదర్శించాలని సంబంధిత అధికారులు మంగళవారం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒక ఉత్పత్తిలో వినియోగించిన స్థానిక వనరుల శాతాన్నీ ప్రదర్శించాలని అధికారులు ఆదేశించారు. విక్రయదారులు ఈ ఆదేశాలను పాటించకపోతే వెబ్‌సైట్ నుంచి సంబంధిత ఉత్పత్తులను తొలగిస్తామని హెచ్చరించారు.
రెండు వారాల్లోగా..
ప్రైవేటు ఈ కామర్స్ కంపెనీలకు ఈ నిబంధన వర్తిస్తుందో లేదో తెలియనప్పటికీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇందుకు ముందుకు రావడం గమనార్హం. ఈ రోజు జరిగిన ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. రెండు వారాల్లోగా దేశీయ మూలాలను ప్రదర్శిస్తామని చెప్పినట్టు సమాచారం.
గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చైనా వస్తువుల బహిష్కరణ ప్రచారం పుంజుకుంది. వివిధ పరిశ్రమలకు చెందిన సంఘాలు సైతం ఈ ప్రచారానికి మద్దతు ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వ ఈ-మార్కెట్ వేదిక నిబంధనల్లో మార్పు చేయగానే అమెజాన్ వంటి వెబ్‌సైట్లలోనూ ఈ మార్పులు తీసుకురావాలని ఆర్‌ఎస్‌ఎస్ మంగళవారం సూచించడం గమనార్హం.
ఇదీ చూడండి:ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు గడువు పెంపు