దేశంలో ఉల్లి ధరల ఘాటు రోజు రోజుకు పెరుగుతోంది. దేశ రాజధాని దిల్లీ సహా పలు ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.70-80కి చేరి సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. ఉల్లి అధికంగా పండించే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా సరఫరా నిలిచి.. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం..
రిటైల్ మార్కెట్లో.. ఉల్లి ధర గతవారం కిలోకు రూ.57(దిల్లీ), రూ.56 (ముంబయి), రూ.48 (కోల్కతా), రూ.34 (చెన్నై) వరకు ఉంది. ఇదే సమయంలో గురుగ్రామ్, జమ్ములో అత్యధికంగా రూ.60కి చేరింది. అయితే ఈ వారాంతంలో రూ.70-80 వరకు చేరినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.