చైనా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ 8 ప్రోను అమెజాన్ ఇండియాలో గురువారం విక్రయాలు ప్రారంభించింది. నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడుపోయినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతల మధ్య చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని చాలా మంది పిలుపునిస్తున్నారు. సామాజిక మాధ్యమ వేదికల్లో బాయ్‌కాట్ చైనా అంటూ నినదిస్తున్నారు. కానీ, వన్‌ప్లస్ 8 అమ్మకాలు తీరు దీనికి భిన్నంగా ఉందని చెప్పవచ్చు.
వ్యతిరేకత పెరిగినా..
దేశంలోని వినియోగదారుల్లో చైనా వ్యతిరేక భావజాలం పెరిగిందని ఇటీవల కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. కరోనా మూలాలు చైనాలోని వుహాన్‌లో ఉండటమే ఇందుకు కారణమని ఈ అధ్యయనం అంచనావేసింది. సగానికిపైగా భారత వినియోగదారులు మేడ్ ఇన్ చైనా వస్తువులపై ప్రతికూల భావంతో ఉన్నట్లు తెలిపింది.
వన్ ప్లస్ 8 శ్రేణిని ఏప్రిల్‌లో విడుదల చేసింది సంస్థ. అయితే లాక్డౌన్ కారణంగా భారత్‌లో మే 18న వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయగా జూన్ 15న వన్‌ప్లస్ 8 ప్రోను అందుబాటులోకి తెచ్చింది. వన్‌ప్లస్, అమెజాన్.. ఎన్ని ఫోన్లు అమ్మారో స్పష్టత ఇవ్వలేదు. అయితే భారత్‌లో వన్‌ప్లస్ ఫోన్లకు డిమాండ్ అధికంగానే ఉంది. ఫలితంగా నిమిషాల్లోనే అన్ని అమ్ముడుపోయినట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వన్‌ప్లస్ 8 ప్రత్యేకతలు..
6.55 అంగుళాల తెర
మూడు రంగుల్లో లభ్యం
స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్
12 జీబీ ర్యామ్- 256 జీబీ స్టోరేజ్
వెనుకవైపు మూడు కెమెరాలు