తెలంగాణ

telangana

ETV Bharat / business

నెరవేరని 'ఒకే దేశం.. ఒకే పాలసీ' లక్ష్యం - దేశంలో బీమా పాలసీలు

దేశంలో ఎన్నో బీమా సంస్థలు.. పలు రకాల పాలసీలను అందిస్తున్నాయి. అయితే.. ఒకే రకం పాలసీలో ఉండే వేర్వేరు నిబంధనలు మనల్ని గందరగోళానికి గురిచేస్తాయి. వీటిని అర్థం చేసుకోవడం సవాలుగా మారుతోంది. దీన్ని అధిగమించేందుకు ప్రతి విభాగంలోనూ ఓ ప్రామాణిక పాలసీని తీసుకురావాలని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్​డీఏఐ) పలు పాలసీలను తీసుకొచ్చింది. అయితే.. సరైన రీతిలో వీటిని ప్రచారం చేయకపోవడం వల్ల.. ఆశించిన లక్ష్యం నెరవేరట్లేదు.

One Nation One Insurance Policy
'ఒకే దేశం.. ఒకే పాలసీ'.. నెరవేరని లక్ష్యం

By

Published : Feb 21, 2021, 2:41 PM IST

సంస్థ ఏదైనా నిబంధనలన్నీ ఒకేలా అందించడంలో బీమా సంస్థల ఉదాసీనత, సొంత పాలసీల విక్రయానికే మొగ్గు, అనుకోని విధంగా ఆర్థిక నష్టం జరిగినప్పుడు.. దాన్ని తట్టుకోవడం అందరి వల్లా కాదు. దీనికోసమే రకరకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే.. 24 జీవిత బీమా సంస్థలు.. 34 సాధారణ బీమా సంస్థలు.. అవి అందించే వందల పాలసీలు.. ఒకే రకం పాలసీలోనూ వేర్వేరు నిబంధనలు.. వీటన్నింటినీ అర్థం చేసుకోవడం.. మనకు ఏది నప్పుతుందో అర్థం చేసుకోవడం పెద్ద సవాలే.! దీన్ని అధిగమించి ప్రతి విభాగంలోనూ ఒక ప్రామాణిక పాలసీని తీసుకురావాలని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) పలు పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. బీమా పాలసీల ఎంపికలో గందరగోళాన్ని తొలగించడమే దీని ప్రధాన లక్ష్యం. అయితే.. బీమా సంస్థలు వీటిని పెద్దగా ప్రచారం చేయకపోవడం ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు.

బీమా పాలసీల అవసరం గుర్తించారు

కరోనా తర్వాత జీవిత, ఆరోగ్య బీమా పాలసీల అవసరాన్ని అందరకూ గుర్తించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వీటికి ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. అయితే, జీవిత, ఆరోగ్య బీమా పాలసీల నిబంధనలు పాలసీదారులకు ఇబ్బందిగా మారాయి. కొవిడ్‌-19 చికిత్సకు సంబంధించి వైద్య బీమా పాలసీల్లో స్పష్టత లేకపోవడం, పరిహారం ఇవ్వడానికి బీమా సంస్థలు నిరాకరించినప్పుడు ఐఆర్‌డీఏఐ రంగంలోకి దిగింది. అన్ని ఆరోగ్య బీమా పాలసీలు కరోనా చికిత్సకు పరిహారం ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. అదే సమయంలో కొన్ని ప్రామాణిక పాలసీల అవసరాన్ని గుర్తించిన నియంత్రణ సంస్థ కరోనా కవచ్, కరోనా రక్షక్‌ పేర్లతో తొలిసారిగా ప్రామాణిక పాలసీలను రూపొందించి, అన్ని బీమా సంస్థలు ఈ పాలసీలను అందించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో పాటు ఆరోగ్య సంజీవని పేరుతో మరో ప్రామాణిక ఆరోగ్య పాలసీని అందించాలని సాధారణ బీమా సంస్థలకు సూచించింది. గరిష్ఠంగా రూ.5 లక్షల వరకూ ఈ పాలసీని అందించాలని తెలిపింది.

వైద్యం నుంచి టర్మ్‌ వరకూ...

ప్రామాణిక వైద్య బీమా పాలసీ ఆరోగ్య సంజీవనితో పాటు ఐఆర్‌డీఏఐ జీవిత బీమా విభాగంలోనూ సరళ్‌ జీవన్‌ బీమా పాలసీని తీసుకొచ్చింది. జనవరి 1 నుంచి ఈ పాలసీని అన్ని బీమా సంస్థలూ అందుబాటులోకి తీసుకురావాలని తెలిపింది. ఎలాంటి ఆదాయం లేని వారూ ఈ పాలసీని తీసుకునేందుకు వీలుంది. రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ దీన్ని ఎంచుకోవచ్చు. వీటితో పాటు.. దోమల నుంచి సంక్రమించే వ్యాధులకు ప్రత్యేక పాలసీని ఇటీవలే ప్రవేశ పెట్టింది. ప్రామాణిక గృహ బీమా పాలసీనీ తీసుకొచ్చింది. ఏప్రిల్‌ 1 నుంచి యాన్యుటీ పాలసీల్లో సరళ్‌ పెన్షన్‌ యోజననూ తీసుకురావాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకే తరహా నిబంధనలతో పాలసీ అందుబాటులోకి వస్తే.. పాలసీదారులకు పాలసీల ఎంపిక సులభంగా ఉంటుందని ఐఆర్‌డీఏఐ భావన. అయితే, బీమా సంస్థలు సొంతంగా ప్రీమియం రేట్లను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుంది.

వెబ్‌సైట్లకే పరిమితం...

'ఒకే దేశం.. ఒకే పాలసీ.. ఒకే ప్రీమియం' అనే నినాదంతో ఈ పాలసీలను అందించాలన్న లక్ష్యంతో ఐఆర్‌డీఏఐ పాలసీలను తీసుకొచ్చినప్పటికీ.. బీమా సంస్థలు మాత్రం వీటిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 'నిబంధనలు పాటించాలి' కాబట్టి.. పాలసీలను అందుబాటులోకి తెచ్చామన్నట్లు వ్యవహరిస్తున్నాయి. పాలసీదారులకు తమ సొంత పాలసీలను అందించేందుకే మొగ్గు చూపిస్తున్నాయి. ఎవరైనా ప్రత్యేకంగా ఈ పాలసీని అడిగినా బీమా సంస్థలు పెద్దగా ప్రోత్సహించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సంస్థలు తమ వద్ద ఈ పాలసీలు ఉన్నాయన్న విషయాన్నీ తెలియజేయడం లేదు. టర్మ్‌ పాలసీ సరళ్‌ జీవన్‌ బీమాను ఇప్పటికీ ఒకటి రెండు బీమా సంస్థలే ప్రముఖంగా తమ వెబ్‌సైట్లలో పేర్కొన్నాయి.

సాధారణంగా ఒక బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి.. దానికి సంబంధించిన నియమ నిబంధనలు, ప్రీమియాన్ని నిర్ణయించేందుకు బీమా సంస్థలకు కనీసం ఒకటి రెండేళ్ల సమయం పడుతుంది. ఐఆర్‌డీఏఐ ప్రామాణిక పాలసీల్లో నిబంధనలు, మినహాయింపుల్లాంటివన్నీ ముందే వివరంగా ఉంటున్నాయి. బీమా సంస్థలు చేయాల్సిందల్లా.. ప్రీమియాన్ని నిర్ణయించి, పాలసీని అందించడమే. అయితే.. ఇక్కడా బీమా సంస్థలు ఈ పాలసీలను నిరుత్సాహపరుస్తున్నాయి. ప్రామాణిక పాలసీలకు.. సాధారణ పాలసీలకంటే అధిక ప్రీమియాన్ని వసూలు చేస్తున్నాయి. ఫలితంగా.. కొనుగోలుదారులూ వీటిపై పెద్దగా దృష్టి సారించడం లేదు. ఇప్పటికైనా బీమా సంస్థలు పాలసీదారులకు సులభంగా అర్థమయ్యే ప్రామాణిక పాలసీలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చదవండి:ఆరోగ్య బీమాతో ధీమాగా బతికేయండిలా..

ABOUT THE AUTHOR

...view details