తెలంగాణ

telangana

ETV Bharat / business

Software jobs for Freshers: కొత్తగా లక్ష ఐటీ ఉద్యోగాలు! - సాఫ్ట్​వేర్ ఉద్యోగాలు

కొత్త ఉద్యోగాలు కల్పించటంలో ఐటీ రంగం (software jobs in india for freshers) అగ్రగామిగా మారింది. కరోనా మహమ్మారి వల్ల అన్ని రకాలైన పనులు డిజిటల్‌ వైపు మళ్లిన ఫలితంగా ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో లభిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఐటీ కంపెనీలు కేంపస్‌ నియామకాల ద్వారా దాదాపు ఒక లక్ష మంది 'ఫ్రెషర్ల' ను (jobs for freshers) ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

software jobs latest news
సాఫ్ట్​వేర్ ఉద్యోగాలు

By

Published : Oct 31, 2021, 6:01 AM IST

త ఏడాది కరోనా మహమ్మారి కారణంగా వివిధ వ్యాపార రంగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవలసి వచ్చింది. కానీ ఐటీ రంగం మాత్రం అందుకు మినహాయింపు. అంతేగాదు, ఇప్పుడు కొత్త ఉద్యోగాలు కల్పించటంలోనూ ఐటీ రంగం (software jobs in india for freshers) అగ్రగామిగా మారింది. కరోనా మహమ్మారి వల్ల అన్ని రకాలైన పనులు డిజిటల్‌ వైపు మళ్లిన ఫలితంగా ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో లభిస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీలకు భారీగా ఐటీ నిపుణులు అవసరమవుతున్నారు. ఈ నేపథ్యంలో జోరుగా 'కేంపస్‌' నియామకాలు చేపడుతున్నాయి. ఈ ఏడాదిలో ఐటీ కంపెనీలు కేంపస్‌ నియామకాల ద్వారా దాదాపు ఒక లక్ష మంది 'ఫ్రెషర్ల' ను ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో సగం మందికి పైగా పెద్ద కంపెనీలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, కాగ్నిజెంట్‌ తీసుకునే అవకాశం ఉంది. దీని ప్రకారం చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ నియామకాలు ఎంతో ఆకర్షణీయంగా ఉండబోతున్నట్లు స్పష్టమవుతుంది.

గత ఆరునెలల వ్యవధిలో టీసీఎస్‌ ఒక్కటే 43,000 మంది గ్రాడ్యుయేట్లను ఎంపిక చేసింది. మరోపక్క హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ కాలేజీలు, యూనివర్సిటీల కేంపస్‌ల నుంచి 20,000 మందిని ఉద్యోగాల్లోకి తీసుకునే సన్నాహాల్లో నిమగ్నమైంది. వచ్చే ఏడాదిలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ దీనికి మించిన సంఖ్యలో కేంపస్‌ నియామకాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 45,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ ఆఫర్లు ఇస్తామని (software jobs news) కాగ్నిజెంట్‌ తెలిపింది. వీరంతా 2022లో ఉద్యోగాల్లో చేరతారని పేర్కొంది.నిపుణుల అవసరాలు పెరుగుతున్నందున బీటెక్‌ గ్రాడ్యుయేట్లను ముందుగానే ఉద్యోగాల్లోకి తీసుకొని తగిన శిక్షణ ఇచ్చి సిద్ధంగా పెట్టుకోవాలనే ఆలోచనతోనే ఐటీ కంపెనీలు నియామకాలు పెంచినట్లు తెలుస్తోంది.

డిజిటల్‌ టెక్నాలజీలతో..

టీవల కాలంలో ఐటీ పరిశ్రమలో (Migration of employees) ఉద్యోగుల వలసలు (ఆట్రిషన్‌ రేటు) పెరిగిన విషయం విదితమే. ఉద్యోగ వలసలు ఐటీ పరిశ్రమలో 10- 12 శాతం ఉండటం సర్వసాధారణం. కానీ ఇప్పుడు అది 20 శాతం వరకూ పెరిగింది. ఐటీ కంపెనీలు నియామకాలను అధికం చేయటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. 'ఇటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో ఎన్నడూ లేదు. 2010లో ఒక్కసారిగా ఐటీ నిపుణులకు అధిక డిమాండ్‌ కనిపించింది, మళ్లీ ఇప్పుడే.. ఇలా చూడటం' అని ఐటీ పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
డిజిటల్‌ టెక్నాలజీస్‌ వినియోగం పెరగటం, అందుకు సంబంధించిన ప్రాజెక్టులు అధికంగా లభిస్తున్నందున ఐటీ కంపెనీలు 'ఫ్రెషర్ల'పై దృష్టి సారించినట్లు హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) అధ్యక్షుడు భరణి కుమార్‌ అరోల్‌ 'ఈనాడు' కు వివరించారు. ప్రస్తుతం ఐటీ నిపుణులను డిజిటల్‌ టెక్నాలజీస్‌ వైపు ఇప్పటికిప్పుడు మళ్లించటం కష్టం కాబట్టి, కొత్త ఉద్యోగులను తీసుకొని వారిని మొదటి నుంచి డిజిటల్‌ టెక్నాలజీ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. తద్వారా భవిష్యత్తు అవకాశాలకు ఐటీ రంగం ముందుగానే సన్నద్ధం అవుతోందని వివరించారు. హైదరాబాద్‌లో 15,000 మందికి పైగా 'ఫ్రెషర్ల'ను కేంపస్‌ నియామకాల ద్వారా ఐటీ కంపెనీలు ప్రస్తుత సీజన్లో తీసుకునే అవకాశం ఉన్నట్లు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 'ఆన్‌లైన్‌' పద్ధతిలో నియామకాలు నిర్వహించే అవకాశాన్ని ఐటీ కంపెనీలు అందిపుచ్చుకుంటున్నాయని అన్నారు. దీని వల్ల అటు ఐటీ పరిశ్రమ, ఇటు ఉద్యోగార్ధులకు మేలు జరుగుతోందని వివరించారు.

ఆర్థిక సేవల్లో నియామకాల జోరు

భారత ఆర్థిక సేవల రంగంలో నియామకాలు జీవనకాల గరిష్ఠానికి చేరాయి. స్టాక్‌ మార్కెట్‌ దూకుడుతో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌, ప్రైవేట్‌ ఈక్విటీ, వెంచర్‌ క్యాపిటల్‌, అసెట్‌ మేనేజ్‌మెంట్‌, సంస్థాగత ఈక్విటీలు, ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ల్లోని కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. కంపెనీల ఒప్పందాలు, ఐపీఓలు, డిజిటలీకరణ వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు వరకు చూస్తే.. ఈ విభాగాల్లో 300కు పైగా సీనియర్‌ స్థాయి ఉద్యోగుల (సీఎక్స్‌ఓ, సీఎక్స్‌ఓ-1) నియామకాలు జరిగాయి. మధ్య, జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ సహా అన్ని స్థాయుల్లో నియామక కార్యకలాపాలు సగటున 30-50 శాతం మేర పుంజుకున్నాయి. కొవిడ్‌ మునుపటి రోజులతో పోలిస్తే బృంద బలాన్ని నాలుగు రెట్లు వరకు పెంచిన సంస్థలు ఉన్నాయని కంపెనీల మానవవనరుల (హెచ్‌ఆర్‌) అధిపతులు చెబుతున్నారు. సెప్టెంబరులో బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల రంగంలో నియామకాలు 43 శాతం పెరిగాయని నౌకరీ డాట్‌ కామ్‌ స్పష్టం చేసింది. నైపుణ్యం కలిగిన వారి కోసం కంపెనీలు పోటీపడుతుండటంతో వేతనాల్లో సైతం వృద్ధి కనిపిస్తోంది. కీలక పదవుల్లో నిపుణులకు ఒకేసారి పలు అవకాశాలు వస్తున్నాయి.

ఇదీ చదవండి:గోద్రెజ్​ గ్రూపులో త్వరలో వ్యాపార విభజన!

ABOUT THE AUTHOR

...view details