దేశీయ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తొలి ఈ-స్కూటర్‌ను విపణిలోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న ఈ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఓలా గ్రూప్ సీఈఓ భవీష్ అగర్వాల్ అధికారికంగా ప్రకటించారు.
"ఓలా స్కూటర్‌ను ప్రీబుకింగ్ చేసుకున్నవారికి కృతజ్ఞతలు. ఆగస్టు 15న ఈ స్కూటర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. అదే రోజు స్కూటర్ ఫీచర్లు, కొనుగోలుకు అందుబాటులో ఉండే తేదీలు సహా ఇతర వివరాలు వెల్లడిస్తాం."
- భవీష్ అగర్వాల్, ఓలా గ్రూప్ సీఈఓ
గత నెల 15న ప్రకటించిన ప్రీ బుకింగ్‌కు భారీ స్పందన లభించిందన్న భవీష్.. బుకింగ్ ప్రారంభించిన 24 గంటల్లోనే లక్ష బుకింగ్స్ వచ్చాయని పేర్కొన్నారు. పది విభిన్న రంగుల్లో ఈ స్కూటర్‌ను విపణిలోకి ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది.