ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే రూ.499 చెల్లించి బుక్ చేసుకున్న కస్టమర్‌లు మిగతా మొత్తాన్ని చెల్లించి స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు.
నిజానికి గత వారమే అమ్మకాలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇందుకు సంబంధించి వెబ్సైట్ పూర్తిగా సిద్ధమవనందున.. విక్రయాలను వారం పాటు వాయిదా వేసింది ఓలా ఎలక్ట్రిక్.
ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి ఈ-మెయిల్ పంపిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. వారంతా కంపెనీ అధికారిక వెబ్సైట్, ఓలా యాప్ ద్వారా కొనుగోళ్లను పూర్తి చేయొచ్చని వెల్లడించింది.
బుకింగ్ ఇలా..
మీరు ఇప్పటికే ముందస్తు బుకింగ్ చేసుకుంటే.. మీ ఫోన్ నంబర్‌తో ఓలా ఎలక్ట్రిక్ వైబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కొనుగోలు చేయాలనుకుంటున్న వేరియంట్, కలర్‌ను ఎంపిక చేసుకుని.. మిగతా మొత్తం చెల్లించి కొనుగోలును పూర్తి చేయొచ్చు. బుకింగ్ సమయంలో చేసుకున్న ఎంపికలను మార్చుకునే సదుపాయం కూడా ఉంది.
కొత్తగా ఈ-స్కూటర్ కొనాలనుకుంటే.. రూ. 499 టోకెన్ మొత్తాన్ని చెల్లించి రిజర్వ్ చేసుకోవచ్చు.
పేమెంట్:మీరు ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి.. బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రూ.2,999 ఈఎంఐ ఆప్షన్‌తో.. ఫినాన్స్ సదుపాయం కూడా ఉంది. ఓలా 'ఎస్1 ప్రో' మోడల్‌కు ఈఎంఐ 3,199 నుంచి ప్రారంభమవుతుంది.