తెలంగాణ

telangana

ETV Bharat / business

అత్యంత సంపన్న మహిళల్లో రెండో స్థానానికి 'నైకా' ఫౌండర్​

దేశీయంలో అత్యంత సంపన్న మహిళల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు నైకా (Nykaa) వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్. నైకా షేర్లు.. పెట్టుబడికి దాదాపు సమాన ప్రతిఫలాన్ని అందిస్తూ.. స్టాక్‌మార్కెట్లలో శుభారంభం చేశాయి. దీంతో ఫల్గుణి ఈ ఘనత సాధించారు.

Nykaa founder Falguni Nayar
నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్​

By

Published : Nov 11, 2021, 8:31 AM IST

నైకా(Nykaa) షేర్లు స్టాక్‌మార్కెట్లలో శుభారంభం చేశాయి. మదుపర్లపై లాభాల వర్షం కురిపించాయి. పెట్టుబడికి దాదాపు సమాన ప్రతిఫలాన్ని అందించాయి. షేర్ల దూకుడుతో నైకా మార్కెట్‌ విలువ తొలి రోజే రూ.1,00,000 కోట్ల మైలురాయిని అధిగమించింది. అంతేకాదు.. కంపెనీ వ్యవస్థాపకురాలైన ఫల్గుణి నాయర్‌ దేశంలోనే స్వయం శక్తితో ఎదిగిన అత్యంత సంపన్న మహిళ్లలో అగ్ర స్థానానికి చేరారు.

నైకా గురించి..

  • కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన ఫల్గుణి నాయర్‌ 2012లో నైకాను స్థాపించారు.
  • నైకా, నైకా ఫ్యాషన్‌ అనే రెండు వ్యాపార విభాగాల కింద సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ, ఫ్యాషన్‌ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇందులో సొంతంగా తయారు చేసిన ఉత్పత్తులూ ఉన్నాయి.
  • 2021 ఆగస్టు 31 వరకు ఈ సంస్థ మొబైల్‌ యాప్‌లు 5.58 కోట్ల మేర డౌన్‌లోడ్‌ అయ్యాయి.
  • 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.61 కోట్ల ఏకీకృత లాభాన్ని ఆర్జించింది.
  • 2021 నవంబరులో వచ్చిన కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు 81.78 రెట్ల స్పందన లభించింది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను విక్రయ కేంద్రాలు, గిడ్డంగుల ఏర్పాటుకు, రుణాల చెల్లింపునకు కంపెనీ వినియోగించనుంది.

నైకా(Nykaa) బ్రాండుపై సౌందర్య ఉత్పత్తులను విక్రయించే ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఇ-కామర్స్‌ వెంచర్స్‌(FSN E-Commerce Ventures Limited) షేర్లు బుధవారం స్టాక్‌ఎక్స్ఛేంజీల్లో నమోదైన తొలి రోజే అదరగొట్టాయి. ఇష్యూ ధర రూ.1,125 కాగా.. దీనికి 77.86 శాతం అధికంగా రూ.2,001 వద్ద బీఎస్‌ఈలో షేర్లు నమోదయ్యాయి. అదే జోరు కొనసాగిస్తూ 99.83శాతం పెరిగి రూ.2,248.10కు చేరాయి. చివరకు ఇష్యూ ధర కంటే 96.15శాతం అధికంగా రూ.2,206.70 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలోనూ ఇష్యూ ధర కంటే 79.37 శాతం అధికంగా రూ.2,018 వద్ద షేర్లు నమోదయ్యాయి. చివరకు 96.26 శాతం లాభంతో రూ.2,208 వద్ద ముగిశాయి. షేర్ల దూకుడుతో బీఎస్‌ఈలో తొలి రోజే కంపెనీ మార్కెట్‌ విలువ రూ.లక్ష కోట్లు అధిగమించి, రూ.1,04,438.88 కోట్ల వద్ద స్థిరపడింది.

పెట్టుబడంత లాభం..

నైకా పబ్లిక్‌ ఇష్యూలో ఒక లాట్‌కు 12 షేర్లను నిర్ణయించారు. ఇష్యూ ధర రూ.1,125 ప్రకారం ఒక లాట్‌కు పెట్టుబడి రూ.13,500 అవుతుంది. బీఎస్‌ఈలో నమోదు ధర (రూ.2,001) ప్రకారం ఈ పెట్టుబడి విలువ రూ.24,012కి పెరిగింది. అంటే రూ.10,512 లాభం వచ్చింది. ముగింపు ధర ప్రకారం (రూ.2,206.70) పెట్టుబడి విలువ రూ.26,480కి చేరింది. అంటే లాభం రూ.12,980. మదుపర్లు పెట్టిన పెట్టుబడికి దాదాపు సమాన మొత్తం లాభంగా తొలిరోజే వెనక్కి వచ్చేసింది.

మజుందార్‌షాను వెనక్కి నెట్టిన ఫల్గుణి

ఎఫ్‌ఎస్‌ఎన్‌ ఇ-కామర్స్‌ వెంచర్స్‌లో(FSN E-Commerce Ventures Limited) సంస్థ వ్యవస్థాపకురాలైన ఫల్గుణి నాయర్‌(Falguni Nayar), కుటుంబానికి కలిపి 54.22 శాతం (2.53 కోట్ల)(falguni nayar net wort) షేర్లున్నాయి. షేర్ల దూకుడుతో ఆమె సంపద విలువ 7.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.56,000 కోట్ల)కు పెరిగింది.ఈ లెక్కన ఆమె దేశంలోనే అత్యంత సంపన్న మహిళల్లో సావిత్రి జిందాల్‌ (12.9 బి.డాలర్ల సంపద) తర్వాతి స్థానంలో నిలిచారు. స్వయం శక్తి సంపన్న మహిళల్లో తొలిస్థానాన్ని నాయర్‌ పొందారు. బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా (సుమారు రూ.36,000 కోట్లు)ను వెనక్కి నెట్టినట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం తెలుస్తోంది. ఫోర్బ్స్‌ భారత శ్రీమంతుల జాబితా ప్రకారం.. ముత్తూట్‌ కుటుంబం, మారికో, ఏషియన్‌ పెయింట్స్‌, కేడిలా హెల్త్‌కేర్‌ యాజమాన్యాలు, ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌కు చెందిన భాటియా కుటుంబం కంటే కూడా ఇప్పుడు ఫల్గుణినే అత్యంత ధనికురాలు.

మదుపర్లు ఏం చేయొచ్చు

కొత్త తరహా వ్యాపారమైనందున భవిష్యత్‌లో వృద్ధికి అపార అవకాశాలు ఉండొచ్చనే ఆశాభావంతో ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపర్లు మొగ్గు చూపారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇతర అంకురాలకు భిన్నంగా ఇప్పటికే లాభాల్లో నడుస్తుండటం కూడా ఈ సంస్థకున్న మరో సానుకూలాంశంగా చెబుతున్నారు. 2025 కల్లా భారత్‌లో సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఫ్యాషన్‌ రంగ పరిమాణం రూ.10.6 లక్షల కోట్లకు చేరుతుందన్న అంచనాలు, కంపెనీ బలమైన ఆర్థిక మూలాలు, అత్యుత్తమ యాజమాన్య బృందం, బ్రాండు విశిష్ఠత దృష్ట్యా ఈ కంపెనీ షేరును దీర్ఘకాలానికి అట్టేపెట్టుకోవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:ఆఖరి రోజు అదరగొట్టిన పేటీఎం ఐపీఓ!

ABOUT THE AUTHOR

...view details