NSE begins hunt for MD, CEO: ప్రముఖ స్టాక్‌ఎక్స్ఛేంజీ ఎన్‌ఎస్‌ఈ కొత్త ఎండీ-సీఈఓ కోసం అన్వేషిస్తోంది. ప్రస్తుతం ఈ పదవులను నిర్వహిస్తున్న విక్రమ్ లిమాయే ఐదేళ్ల పదవీకాలం వచ్చే జులైలో ముగియనుంది. ఈ పదవి కోసం ఐపీఓ వ్యవహారాలపై అనుభవమున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఎక్స్ఛేంజీ ఆహ్వానించింది. ఈనెల 25 కల్లా దరఖాస్తులు పంపాలని కోరింది. వీళ్లలో నుంచి తుది జాబితాను నామినేషన్స్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ రూపొందిస్తుంది. ఇందులో నుంచి ఒక పేరును ఎన్‌ఎస్‌ఈ డైరెక్టర్ల బోర్డుకు ఎంపిక కమిటీ సిఫారసు చేస్తుంది. అనంతరం తుది ఆమోదం కోసం ఆ పేరును సెబీకి పంపిస్తారు.
లిమాయే కొనసాగేందుకు వీలున్నా..
వాస్తవానికి మరో విడత పదవిలో కొనసాగేందుకు లిమాయే అర్హులే. అయితే సెబీ నిబంధన ప్రకారం.. మళ్లీ ఆ పదవిలో కొనసాగాలంటే ఇతర అభ్యర్థులతో లిమాయే పోటీపడాల్సి ఉంటుంది. ఎన్‌ఎస్‌ఈ మాజీ ఎండీ, సీఈఓ చిత్రా రామకృష్ణ వైదొలిగిన అనంతరం 2017 జులైలో లిమాయే ఈ బాధ్యతలు చేపట్టారు. 2014లో చిత్రా రామకృష్ణను ఎండీ, సీఈఓగా నియమించిన సమయంలో దరఖాస్తులు ఆహ్వానించక పోవడంపై పలు ఆరోపణలు వచ్చాయి. పరిపాలనా వైఫల్యాలు, కోలోకేషన్ వ్యవహారంపై ప్రస్తుతం నియంత్రణ సంస్థల నుంచి ఎన్‌ఎస్‌ఈ దర్యాప్తును ఎదుర్కొంటోంది. అయితే కఠిన పరిస్థితుల్లో ఎన్‌ఎస్‌ఈను తిరిగి వృద్ధి పథంలో నడిపించడంలో లిమాయే కీలక పాత్ర పోషించారు. ఈయన హయాంలో డెరివేటివ్స్ ట్రేడింగ్ విభాగంలో లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. గతేడాది ఎన్‌ఎస్‌ఈలో సాంకేతిక లోపం కారణంగా ట్రేడింగ్ కొంత సేపు నిలిచిపోవడం ఇబ్బంది కలిగించింది.
ఇదీ చదవండి:స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడుల జోరు