తెలంగాణ

telangana

ETV Bharat / business

Novavax Vaccine: టీకా సామర్థ్యం 90శాతం - నొవావాక్స్‌ టీకా భారత్​లోకి ఎప్పుడు

అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకా 'నొవావాక్స్‌' త్వరలోనే భారత్​లో అందుబాటులోకి రానుంది. ఈ తరుణంలో.. వివిధ రకాల కరోనా వైరస్ వేరియంట్లపై తమ టీకా 90 శాతానికి పైగా ప్రభావవంతంగా పనిచేస్తుందని సంస్థ ప్రకటించింది.

Novavax
నొవావాక్స్‌

By

Published : Jun 15, 2021, 7:02 AM IST

కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన నొవావాక్స్‌(novavax vaccine) సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ 90శాతం సమర్థత కలిగివుందని వెల్లడించింది. అమెరికాతో పాటు మెక్సికోలో దాదాపు 30వేల మందిపై జరిపిన ప్రయోగ్రాల సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం ఈ ఫలితాలు వచ్చాయని నొవావాక్స్‌ ప్రకటించింది. ప్రపంచదేశాలను వ్యాక్సిన్‌ కొరత వేధిస్తోన్న సమయంలో నొవావాక్స్‌ అందుబాటులోకి రానుండడం ఊరట కలిగించే విషయమని నిపుణులు భావిస్తున్నారు.

ఇతర వ్యాక్సిన్లకు భిన్నంగా..

నొవావాక్స్‌ రూపొందించిన వ్యాక్సిన్‌ను అమెరికా, మెక్సికోలో 18ఏళ్ల వయసుపైబడిన 30వేల మంది వాలంటీర్లపై నిర్వహించారు. వీరికి మూడు వారాల గడువులో రెండు డోసులను ఇచ్చి పరీక్షించారు. తుది దశ ప్రయోగాల సమాచారాన్ని పూర్తిగా విశ్లేషించగా 90శాతం సామర్థ్యాన్ని చూపినట్లు నొవావాక్స్‌ వెల్లడించింది. దీంతో సెప్టెంబర్‌ నాటికి అమెరికా, యూరప్‌తోపాటు మరిన్ని దేశాల్లో వ్యాక్సిన్‌ వినియోగ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటామని పేర్కొంది. అప్పటినుంచి నెలకు 10కోట్ల డోసులను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది. అంతకుముందు బ్రిటన్‌, దక్షిణాఫ్రికాలో జరిపిన చిన్నపాటి ప్రయోగాల్లోనూ 89శాతం ప్రభావశీలత కలిగినట్లు తేలింది. అయితే, ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లకు భిన్న సాంకేతికతతో నొవావాక్స్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా స్పైక్‌ ప్రొటీన్‌ను గుర్తించి, వైరస్‌పై దాడి చేసేలా శరీరాన్ని సిద్ధం చేసే విధంగా ఈ వ్యాక్సిన్‌ రూపొందించారు. ఇందుకోసం ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన ప్రొటీన్‌ కాపీలను వినియోగించారు.

వచ్చే ఏడాదికి 110కోట్ల డోసులు..

వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కనిపించే దుష్ర్పభావాలు కూడా స్వల్పంగానే ఉన్నట్లు నొవావాక్స్‌ సీఈఓ స్టాన్లీ ఎర్క్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్తరకం వైరస్‌ను నొవావాక్స్‌ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ను ఎక్కువగా అల్ప, మధ్య ఆదాయ దేశాలకే సరఫరా చేయడమే లక్ష్యమని స్టాన్లీ ఎర్క్‌ స్పష్టంచేశారు. సెప్టెంబర్‌ నాటికి నెలకు 10కోట్ల డోసులు తయారు చేస్తామని.. డిసెంబర్‌ నాటికి ఈ సంఖ్యను 15కోట్లకు పెంచుతామన్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాదిలో ప్రపంచ దేశాలకు మొత్తం 110కోట్ల డోసులను అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఏర్పాటైన కొవాక్స్‌ కార్యక్రమానికి 35కోట్ల డోసులను అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని స్టాన్లీ ఎర్క్‌ పేర్కొన్నారు.

భారత్‌లోనూ భారీ తయారీ..

అమెరికాకు చెందిన నొవావాక్స్‌ కంపెనీ వ్యాక్సిన్‌ తయారీని భారీ చేపట్టేందుకు భారత్‌(novavax vaccine vaccine in India)లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌(novavax SII)తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున తయారుచేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ సిద్ధంగా ఉంది. అయితే, అమెరికా నుంచి వ్యాక్సిన్‌ ముడి పదార్థాల దిగుమతిలో ఎదురవుతున్న అడ్డంకులు టీకా తయారీకి ఇబ్బందిగా మారుతున్నట్లు సీరం ఇదివరకే అభిప్రాయపడింది.

ఇదిలాఉంటే, అమెరికాలో ఇప్పటికే మూడు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అక్కడ వ్యాక్సిన్‌లకు డిమాండ్‌ తగ్గినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలను వ్యాక్సిన్‌ కొరత వేధిస్తోంది. ఇలాంటి సమయంలో సాధారణ ఉష్క్షోగ్రతల వద్ద నిల్వ చేసుకునే వెసులుబాటు ఉండడంతో రానున్న రోజుల్లో వ్యాక్సిన్‌ కొరతను అధిగమించడంలో తమ టీకా కీలకంగా మారనున్నట్లు నొవావాక్స్‌ భావిస్తోంది.

ఇవీ చదవండి:'భారత్​లో సెప్టెంబర్​ నాటికి 'కొవొవాక్స్‌' టీకా'

సీరం నుంచి 'కొవాక్స్‌'కు 1.1 బిలియన్ల టీకాలు!

ABOUT THE AUTHOR

...view details