పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని ఇంత వరకు ఏ రాష్ట్రం నుంచి కూడా ప్రతిపాదన రాలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో జేడీ(యూ) ఎంపీ రాజీవ్ రాజన్ సింగ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
'వివిధ రాష్ట్రాల సూచనల ఆధారంగా జీఎస్టీ మండలి అజెండా సమావేశం నిర్వహిస్తారు. అయితే ఇంత వరకు ఏ ఒక్క రాష్ట్రం కూడా ఈ అంశాన్ని (పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్టీ విధింపు) సూచించలేదు.' అని ఠాకూర్ వివరించారు. తదుపరి జీఎస్టీ మండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు.