జీవిత బీమాయేతర కంపెనీల ప్రీమియం ఆదాయం భారీగా పెరిగినట్లు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) వెల్లడించింది. జనవరిలో ఆయా కంపెనీల స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం 6.7 శాతం పెరిగి రూ.18,488.06 కోట్లుగా నమోదైనట్లు తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో ఈ మొత్తం రూ.17,333.70 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది.
ఇందులో 25 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియం ఆదాయం గత ఏడాది జనవరితో పోలిస్తే.. 2021 మొదటి నెలలో 10.8 శాతం వృద్ధి చెంది.. రూ.14,663.40 కోట్ల నుంచి రూ.16,247.24 కోట్లకు చేరినట్లు వివరించింది. ఐదు ప్రైవేటు బీమా సంస్థల స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం మాత్రం 1.34 శాతం (రూ.1,530.70 కోట్ల నుంచి రూ.1,510.20 కోట్లకు) తగ్గినట్లు తెలిపింది.
క్యుమిలేటివ్ ప్రాతిపదిక అన్ని జీవిత బీమాయేతర కంపెనీల స్థూల ప్రీమియం ఆదాయం 2020-21 ఏప్రిల్-జనవరి మధ్య 2.76 శాతం పెరిగినట్లు ఐఆర్డీఏఐ తెలిపింది. మొత్తం ఆదాయం అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయంతో పోలిస్తే.. రూ.1,59,275.33 కోట్ల నుంచి రూ.1,63,670.13 కోట్లకు పెరిగిందని వివరించింది.