కరోనా నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లను ముద్రించాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతానికి భారీగా కరెన్సీని ముద్రించే ప్రణాళికేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు.
మరిన్ని వివరాలు..
2020-21లో దేశ వాస్తవిక జీడీపీ అంచనా -7.3 శాతంగా ఉన్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వృద్ధి రేటులో ఈ క్షీణత.. కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు.. దానిని నియంత్రించేందుకు తీసుకున్న చర్యలను ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సంక్షోభంలోనూ దేశ ఆర్థిక మూలాలు స్థిరంగా ఉన్నట్లు మంత్రి ధీమా వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ 2020-21లో రెండో అర్ధ భాగం నుంచి రికవరీ బాటలో పయనించేందుకు ఆత్మనిర్భర్ భారత్ మిషన్ ఎంతగానో తోడ్పడిందని వెల్లడించారు.