కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు(సీబీఐసీ) తన కార్యకలాపాలన్నింటినీ కాగిత రహితంగా మార్చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని జీఎస్టీ, కస్టమ్స్ కార్యాలయాలను పూర్తిగా ఎలక్ట్రానిక్ ఆఫీసులుగా తీర్చిదిద్దింది.
కరోనా ఆంక్షల నేపథ్యంలో.. వీడియో లింక్ ద్వారా ఈ-ఆఫీస్ విధానాన్ని ప్రారంభించారు సీబీఐసీ ఛైర్మన్ అజిత్ కుమార్. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డైరెక్టర్ జనరల్ నీతా వర్మ సహా పలువురు సీబీఐసీ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న 500 జీఎస్టీ, కస్టమ్స్ కార్యాలయాల్లో దాదాపు 50 వేల మంది అధికారులు ఈ-ఆఫీస్ విధానాన్ని ఉపయోగించనున్నట్లు బోర్డు పేర్కొంది. దీంతో కార్యకలాపాల్లో ఆటోమెటిక్ విధానం అమల్లోకి తెచ్చిన అతిపెద్ద ప్రభుత్వ విభాగంగా సీబీఐసీ అవతరించింది.
"కాంటాక్ట్ లెస్, కాగిత రహిత పరోక్ష పన్ను పరిపాలనను అందించడంలో ఈ-ఆఫీస్ మరో ముందడుగు. రోజూవారీ పనిలో ఈ-ఆఫీస్ ఉపయోగించడం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది. పేపర్ వాడకాన్ని తగ్గించడం వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుంది."
-సీబీఐసీ
డిజిటల్ డాక్యుమెంట్లను తయారు చేసిన తర్వాత.. అందులోని ఫైళ్లలో మార్పులు చేయడం గానీ ధ్వంసం చేయడం గానీ కుదరదని సీబీఐసీ వెల్లడించింది. ఫైళ్లు ఎక్కడ చిక్కుకుపోయాయనే విషయాన్ని పసిగట్టే యంత్రాంగం కూడా ఈ-ఆఫీస్లో ఉందని తెలిపింది. దీని ద్వారా సీనియర్ అధికారులు సమస్యను తెలుసుకొని సత్వరం పరిష్కరించే అవకాశం ఉంటుందని పేర్కొంది.
అంతా ఆన్లైన్లోనే