తెలంగాణ

telangana

By

Published : Mar 14, 2021, 10:14 PM IST

ETV Bharat / business

'ఆ ఉద్యోగులను కేంద్రం అలా బెదిరించలేదు'

సోషల్​ మీడియా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు జైలు శిక్ష విధిస్తారంటూ కేంద్రం బెదిరిస్తోందని వచ్చిన ఆరోపణలపై స్పష్టత ఇచ్చింది ఐటీ మంత్రిత్వశాఖ. ప్రభుత్వం ఇలాంటి బెదిరింపులకెప్పుడూ పాల్పడదని పేర్కొంది.

No govt communication ever threatened social media platforms
'ఆ ఉద్యోగులను కేంద్రం అలా బెదిరించలేదు'

ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌ వంటి సోషల్‌మీడియా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు జైలుశిక్ష విధిస్తామని కేంద్రం బెదిరిస్తోందని వచ్చిన ఆరోపణలపై కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ స్పందించింది. ప్రభుత్వం 'సోషల్‌మీడియా' ఉద్యోగులను ఎప్పుడూ అలా బెదిరించలేదని వెల్లడించింది. ఇతర వ్యాపార సంస్థలు పాటిస్తున్నట్లుగా భారత చట్టాలను, భారత రాజ్యాంగాన్ని పాటించడం సోషల్‌మీడియా సంస్థల బాధ్యత అని పేర్కొంది.

నిబంధనలను ఉల్లంఘిస్తున్న వందలాది పోస్టులు, ఖాతాలు, హ్యాష్‌ట్యాగ్‌లను తొలగించాలని ట్విటర్‌ను కేంద్రం ఇటీవల ఆదేశించింది. మొదట ఇందుకు ట్విటర్‌ ఒప్పుకోలేదు. దీంతో సమాచార చట్టాల ప్రకారం కేంద్రం ఆదేశాలను అమలు చేయకపోతే భారత శిక్షాస్మృతి ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించింది. ఆ తర్వాత పార్లమెంట్‌లో ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అమెరికాకు చెందిన సోషల్‌మీడియా సంస్థలు భారత చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. దీంతో సోషల్‌మీడియా ఉద్యోగులను కేంద్రం బెదిరిస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణ అవాస్తమని సమాచార మంత్రిత్వశాఖ తాజాగా వివరణ ఇచ్చింది. ప్రభుత్వం రాతపూర్వకంగా గానీ, మాట రూపంలో గానీ ఏ సోషల్‌మీడియా ఉద్యోగికి జైలుశిక్ష విధిస్తామని బెదిరించలేదని స్పష్టం చేసింది.

'సోషల్‌మీడియా యూజర్లు ప్రభుత్వాన్ని, మోదీని, ఏ మంత్రినైనా విమర్శించొచ్చు. కానీ, హింస, మతపరమైన విద్వేషాలు, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం వంటివి మంచిది కాదు. ద్వేషాన్ని పెంచుతూ, భారతదేశానికి వెలుపల నుంచి హింసను, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం, మహిళల ఫొటోలు మార్ఫింగ్‌ చేయడం, మహిళలపై ఈ-వేధింపులు వంటివి తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి' అని ఐటీ మంత్రిత్వ శాఖ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి:'30 రోజుల్లో టూరిస్ట్ వాహనాలకు ఆల్​ ఇండియా పర్మిట్'

ABOUT THE AUTHOR

...view details