పీఎఫ్ చందాదారులు యూఏఎన్ నంబర్‌తో ఆధార్ అనుసంధానం చేయడాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తప్పనిసరి చేసింది. ఆగస్టు 31ను ఇందుకు తుది గడువుగా విధించింది. ఒకవేళ ఆధార్‌ను జత చేయలేకపోతే సెప్టెంబర్ 1 నుంచి పీఎఫ్‌కు సంబంధించి ఎలాంటి సేవలూ పొందలేరని స్పష్టం చేసింది. యాజమాన్యాలు పీఎఫ్ మొత్తాలను జమ చేయలేకపోవడమే కాకుండా.. పీఎఫ్‌కు సంబంధించి చందాదారులు కూడా నగదును ఉపసంహరించుకోలేరు పేర్కొంది.
సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మే 3న ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలుత ఈపీఎఫ్ ఖాతాకు ఆధార్ జత చేయడానికి జూన్ 1ను గడువుగా విధించింది ఈపీఎఫ్‌ఓ. దాన్ని తాజాగా ఆగస్టు 30 వరకు పొడిగించింది. ఇది వరకే మీరు ఆధార్‌తో మీ పీఎఫ్ ఖాతాను జత చేసి ఉంటే మరోసారి ధ్రువీకరించుకోండి. ఒకవేళ జత చేయకుంటే వెంటనే ఆ పని పూర్తి చేయడం మేలు.