EV battery swapping policy: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ వాహనాల తయారీ, వినియోగాన్ని వేగవంతం చేసేందుకు ఫేమ్ పథకాన్ని ప్రభుత్వం ఆవిష్కరించింది. అయినా విద్యుత్తు వాహనాల వాడకం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. విద్యుత్తు వాహనాలతో పాటు వాటిల్లో వినియోగించే బ్యాటరీ ధర అధికంగా ఉండటం దీనికి ప్రధాన కారణం. బ్యాటరీ ఛార్జింగ్ సదుపాయాలు కూడా విస్తరించాల్సి ఉంది. ప్రస్తుత బ్యాటరీలతో విద్యుత్తు వాహనాలు సుదూర ప్రయాణాలు చేయలేకపోతున్నాయి. అందువల్లే బ్యాటరీ మార్పిడి సేవ (బీఏఏఎస్- బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) కు సంబంధించి ప్రత్యేక విధి విధానాలను 4 నెలల్లో ఆవిష్కరించాలని 'నీతి ఆయోగ్' నిర్ణయించింది. పెట్రోల్/డీజిల్ పోయించుకున్నట్లే.. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందని గ్రహించగానే, వాహనదారుడు సమీపంలోని ఛార్జింగ్ స్టేషనుకు వెళ్లి, వాహనంలోని ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీని తీసి, పూర్తిఛార్జింగ్‌తో ఉన్న బ్యాటరీ అమర్చుకుని వెళ్లేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని చెబుతున్నారు.
'పట్టణాలు/ నగరాల్లో స్థలాభావం కారణంగా ఛార్జింగ్ స్టేషన్లను అధిక సంఖ్యలో ఏర్పాటు చేయలేకపోతున్నారు. పైగా ఛార్జింగ్‌కు అధికసమయం పడుతుంది కనుక వాహనాలను ప్రయాణం మధ్యలో అంతసేపు నిలపడమూ కష్టమే'.. ఈ బాధలు తీరేలా బ్యాటరీ మార్పిడి విధానాన్ని తీసుకువస్తామని కేంద్ర బడ్జెట్‌లోనూ పేర్కొన్నారు. ఈ మార్పులతో విద్యుత్తు వాహనాల ధర దిగివస్తుందని అంచనా వేస్తున్నారు.
ఏ విధంగా మేలు?
విద్యుత్తు వాహనాలను కంపెనీలు రెండు విధాలుగా ఉత్పత్తి చేస్తున్నాయి. 'ఫిక్స్‌డ్' బ్యాటరీ ఉండే వాహనాలను ఇంటి దగ్గర/లేదా సంబంధిత కేంద్రాల్లో ఛార్జింగ్ చేసుకోవాల్సిందే. మరొక రకం వాహనాల్లో బ్యాటరీ ఉండదు. కేవలం వాహనాన్ని మాత్రమే వినియోగదార్లు కొనుగోలు చేస్తారు. బ్యాటరీని అద్దెకు తీసుకుంటారు. ఛార్జింగ్ అయిపోగానే మార్పిడి కేంద్రానికి వెళ్లి ఆ బ్యాటరీ ఇచ్చేసి.. ఛార్జింగ్ ఉన్న బ్యాటరీని తీసుకోవచ్చు. ఇటువంటి వాహనాల ధర సగానికి సగం తక్కువగా ఉంటుంది. బ్యాటరీ మార్పిడికి ఎక్కువ సమయం పట్టదు కనుక, ప్రయాణాలు ఆలస్యం కావు. ఛార్జింగ్ స్టేషన్లను నగరాల్లోని ప్రధాన రహదార్లలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు.
కొన్ని సంస్థల ఆసక్తి