ప్రతి రోజులానే ఆ రోజు ట్రేడింగ్ ప్రారంభమైంది. కొద్దిసేపటికే పంజాబ్ నేషనల్ బ్యాంకు షేర్లు కుప్పకూలిపోయాయి. కారణం ముంబయిలోని బ్రాడీ హౌస్ బ్రాంచ్లో భారీ కుంభకోణం బయటపడటమే. ఈ కుంభకోణం విలువ అక్షరాల రూ.12,700 కోట్లు. చేసింది... ప్రముఖ వజ్రాలు వ్యాపారి నీరవ్ మోదీ.
మోసం ఎలా జరిగింది:
⦁ ముడి వజ్రాల కొనుగోలుకు రుణం కావాలని పంజాబ్ నేషనల్ బ్యాంకును ఆశ్రయించారు నీరవ్ మోదీ. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న బ్యాంకులు విదేశాల్లో చెల్లింపులు జరిపేలా లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్ఓయూ), ఫారిన్ లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేశాయి.
⦁ బ్యాంకు ఉద్యోగులు ఇక్కడే అక్రమాలకు పాల్పడ్డారు. అడ్డదారిలో ఎల్ఓయూలు జారీ చేశారు. వీటిపై విదేశాల్లో ఉన్న భారతీయ బ్యాంకులకు ఎలాంటి అనుమానం రాలేదు. ఎల్ఓయూలు ఆధారంగా ముడి సరకు కొనుగోలుకు నిధులు మంజూరు చేశాయి.
⦁ తరువాత పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు ఇంటర్ మెసేజింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేశారు. విదేశాల్లోని భారతీయ బ్యాంకులు దీని గుర్తించకుండా పీఎన్బీకి అడిగిన రుణాన్ని ఇచ్చాయి. ఈ సొమ్మును ముడి వజ్రాలు సరఫరా చేసిన వారి ఖాతాల్లోకి జమ చేశారు పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు. నీరవ్ మోదీ వజ్రాలు పొందారు. ఈ మొత్తం వ్యవహారంలో కొందరు పీఎన్బీ అధికారులకు ముడుపులు ముట్టినట్లు సీబీఐ విచారణలో తేలింది.