'భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచం అంతా నమ్ముతోంది. ఇప్పుడు దీనికి దూరంగా ఉండటం కాదు. పెట్టుబడులను రెట్టింపు చేయాలి. మార్కెట్ ధోరణి ఎప్పుడూ ఒకే విధంగా ఉండదని మదుపరులు అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడులే ప్రస్తుతం తమ వ్యూహంగా ఉండాలి'అని అంటున్నారు కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ గ్రూప్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ నీలేశ్ షా. 'ఈనాడు'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..
సమీప భవిష్యత్తులో మార్కెట్లలో దిద్దుబాటుకు అవకాశం ఉందా ?
స్టాక్ మార్కెట్ ఎప్పుడూ హెచ్చుతగ్గులతోనే వృద్ధి పథంలో నడుస్తుంటుంది. ఒకే దిశలో ఎప్పుడూ ప్రయాణించదు. కాబట్టి, దిద్దుబాటుకూ సిద్ధంగా ఉండాల్సిందే. కొవిడ్-19 పరిణామాలతో మార్చి 2020లో తగ్గినంత వేగం ఉండదు.
మ్యూచువల్ ఫండ్లలో నెలవారీ సిప్‌ల మొత్తం రూ.10వేల కోట్లు దాటింది కదా.. దీన్ని ఎలా చూస్తున్నారు ?
నిపుణుల ఆధ్వర్యంలో పెట్టుబడులు పెట్టేందుకు మ్యూచువల్ ఫండ్ల ద్వారా మదుపరులకు అవకాశం లభించడం వల్ల చాలామంది వీటిని నమ్ముతున్నారు. ఈ విశ్వాసమే నెలకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) ద్వారా రూ.10వేల కోట్ల మైలురాయిని చేరుకుంది. భవిష్యత్తులోనూ ఫండ్లలో పెట్టుబడులు వృద్ధి చెందే అవకాశం ఉంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మదుపరులకు ఏం సూచిస్తారు ?
సంపదను సృష్టించేందుకు మదుపరులు ఆలోచనతో ముందడుగులు వేయాలి. క్రమం తప్పకుండా మదుపు చేసే పెట్టుబడిదారులే స్టాక్ మార్కెట్ అనే సముద్రానికి ఆధారం. చెట్టు నుంచి మధుర ఫలాలు అందుకోవాలంటే.. కాస్త ఓపికతో ఎదురు చూడాలి. స్టాక్ మార్కెట్లోనూ అంతే. వైవిధ్యమైన పెట్టుబడులతో.. దీర్ఘకాలం వేచి చూడండి. ఎప్పుడూ పెట్టుబడిదారుడిగానే ఉండండి. ట్రేడింగ్ అందరూ చేయలేరని గుర్తుంచుకోండి.
భారత ఆర్థిక వ్యవస్థ పనితీరుపై మీ అభిప్రాయం ఏమిటి ?
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం వృద్ధి పథంలో సాగుతోందని విశ్లేషించవచ్చు. అధిక ద్రవ్యోల్బణం నుంచి ఒక మోస్తరు ద్రవ్యోల్బణానికి మారేందుకు వ్యూహ రచన జరుగుతోంది. అధిక ద్రవ్యలోటును అధిగమించడం, ఫారెక్స్ నిల్వలు పెంచడం, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ తదితర అంశాలు ఆర్థిక వృద్ధికి తోడ్పడే అవకాశం ఉంది. గత దశాబ్దంతో పోలిస్తే.. ఈ దశాబ్దంలో భారత వృద్ధి రేటు బాగుంటుందని చెప్పొచ్చు. రానున్న అయిదేళ్ల కాలంలో స్థిరాస్తి రంగం కోలుకునే అవకాశం ఉంది. దీంతోపాటు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) వల్ల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు మూలధన మద్దతు లభిస్తుంది. ఇవన్నీ కలిపి జీడీపీని గరిష్ఠ ఒక అంకె స్థాయికి చేర్చేందుకు వీలుంది. అనుకున్నవి అన్నీ సానుకూలంగా జరిగితే.. రెండంకెల వృద్ధిని చేరుకునే అవకాశాలూ లేకపోలేదు. భారత ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులకు దూరంగా ఉండటం కాదు.. రెండింతలు ఉండేలా చూసుకోవాలి.
చైనా ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పై ఎలా ఉంది ?
ప్రపంచం ఇప్పటికీ చైనాను వైరస్‌ను ఎగుమతి చేసిన దేశంగానే చూస్తోంది. కొవిడ్ సమయంలో చైనా చర్యలు అంతర్జాతీయంగా అసంతృప్తికి కారణం అయ్యాయి. దీంతో అక్కడికి పెట్టుబడులు తగ్గిపోయాయి. ప్రత్యామ్నాయంగా భారతే కనిపిస్తోంది కాబట్టి, ఇది మన దేశానికి సానుకూల అంశమే.
ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మరోవైపు సమీప కాలంలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ?
ఆహార ధరల ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగానే కనిపిస్తోంది. కాలాలను బట్టి పెరిగే ధరలు దీన్ని ప్రభావితం చేయొచ్చు. ఇంధన ధరల ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణంల మధ్య సమతౌల్యం సాధించేందుకు ఆర్‌బీఐ ప్రయత్నాలు బాగున్నాయి. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చి, వృద్ధికి తోడ్పాటు లభించేవరకూ ఆర్‌బీఐ వడ్డీ రేట్లను ఇప్పటిలాగే నిర్వహించే ఆస్కారం ఉంది.