దేశాలకు ఏ విధంగానైతే సరిహద్దులు నిర్ణయించారో అలాగే ఇంటర్నెట్‌కు కూడా ఇకమీదట ప్రాంతాలు, దేశాల వారీగా సరిహద్దులు ఏర్పడే పరిస్థితులు వస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు! డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (వరల్డ్ వైడ్ వెబ్) ఇక మీదట నిజంగా వరల్డ్‌వైడ్ కాబోదు. భారత్ సమాచారం భారతదేశానికే, చైనా సమాచారం చైనాకే, అమెరికా సమాచారం అమెరికాకే... ఇలా దేశాలు, ప్రాంతాలుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ విడిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సమాచార సౌలభ్యంపై ప్రాంతాల వారీగా పరిమితి! స్ప్లిట్, ఇంటర్నెట్ పదాల నుంచి పుట్టిందే స్ప్లింటర్‌నెట్. అంటే ప్రస్తుతం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్, ఆయా దేశాలకు, ప్రాంతాలకు పరిమితమయ్యేలా విడిపోవడం అన్నమాట.
ఎందుకిలా?
ప్రపంచ రాజకీయాలు, ఆయా దేశాల అంతర్గత భద్రత, ఆందోళనలు, మతవిద్వేషాలు, వాణిజ్య యుద్ధాలు, సైబర్ దాడులు, వీటన్నింటికి తోడు... గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్‌లాంటి దిగ్గజ టెక్నాలజీ సంస్థలతో వివిధ ప్రభుత్వాలకు తలెత్తుతున్న గొడవలు ఇలా అన్నీ కలిసి ఆయా ప్రభుత్వాలు సమాచారంపై నియంత్రణ, తమ పట్టు ఉండాలని భావించేలా చేస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సమాచార సార్వభౌమత్వాన్ని ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. తమకు అనుగుణంగా డేటాపై నియంత్రణకు ఎవరికి వారు వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవటడం, నియంత్రణలు విధించడం మొదలు పెడుతున్నాయి.
చైనా ఫైర్‌వాల్
చైనా ఇటీవలే కొత్త ఇంటర్నెట్ సెన్సార్‌షిప్ మార్గదర్శకాలను విడుదల చేసింది. 100 రంగాలకు సంబంధించిన సమాచారాన్ని అనుమతిలేకుండా ఇంటర్నెట్‌లో పెట్టడానికి ఆ దేశంలో అనుమతించరు. పురాతన చైనా రాజులు ప్రపంచంలో అత్యంత పొడవైన గోడను కడితే.. ఆధునిక చైనా ప్రభుత్వం అత్యంత పటిష్ఠమైన సమాచార గోడ నిర్మించింది. ఇందుకోసం బలమైన ఫైర్‌వాల్‌ను రూపొందించుకుంది. ప్రపంచంలోని సమాచారం తమ ప్రభుత్వ అనుమతి లేకుండా దేశంలో ప్రవేశించకుండా.. తమ సమాచారం ప్రపంచానికి అందకుండా తనదైన ఇంటర్నెట్ వ్యవస్థను సృష్టించుకుంది. అంతర్జాతీయ సంస్థలకు దీటుగా బైదు, అలీబాబా, టెన్సెంట్‌ల రూపంలో తనదైన ఇంటర్నెట్ దిగ్గజాలను తయారు చేసింది. ఇవన్నీ ప్రభుత్వ నియంత్రణలకు లోబడి పనిచేసేవే. తమ ఇంటర్నెట్ దిగ్గజ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ప్రయత్నాలు చేయడం చైనా తెలివికి నిదర్శనం.
తలవంచిన గూగుల్
చైనా మార్కెట్లోకి దూరేందుకు గూగుల్ విశ్వప్రయత్నం చేసింది. కానీ చైనా ప్రభుత్వ నియంత్రణల వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో 2010లో చైనాలో తన సెర్చ్ ఇంజిన్లను గూగుల్ మూసేసింది. ఇప్పుడు దిగివచ్చి చైనా ప్రభుత్వ విధానాలకు తలూపుతోంది. చైనా ప్రభుత్వ నియంత్రణలు, మార్గదర్శకాలకు అనుగుణంగా గూగుల్ డ్రాగన్‌ఫ్లై అనే ఓ ప్రాజెక్టు పేరుతో చైనా ఇంటర్నెట్ వేదికను ఆరంభించింది. మిగిలిన ప్రపంచంలోని గూగుల్‌కు ఈ డ్రాగన్‌ఫ్లై గూగుల్‌కు తేడా ఉంటుంది. ఇది పూర్తిగా చైనా ప్రభుత్వం చెప్పుచేతల్లో నడిచేది.