తెలంగాణ

telangana

ETV Bharat / business

సహకార బ్యాంకుల్లో స్వాహాకారానికి కళ్లెం! - cooperative bank news

మట్టి ముంతలు, కిడ్డీ బ్యాంకుల ద్వారా పిల్లలకు పొదుపు అలవాటు చేసే సమాజంలో- బ్యాంకు అన్నమాటే విశ్వసనీయతకు పర్యాయపదం. కొద్దిపాటి అధిక వడ్డీపై ఆశతో, అది కూడా బ్యాంకే కదా అన్న నమ్మకంతో కష్టార్జితాల్ని సహకార బ్యాంకుల్లో మదుపు చేసిన లక్షలమంది ఖాతాదారుల కొంపలు కొల్లేరయ్యేలా పంజాబ్‌ మహారాష్ట్ర సహకార బ్యాంకు (పీఎంసీ) బాగోతం రచ్చకెక్కి- ఆర్‌బీఐ సహా పలు నిఘా యంత్రాంగాల నిష్ప్రయోజకత్వాన్నే కళ్లకు కట్టింది. అలాంటి దురాకృతాల్ని పునరావృతం కానివ్వరాదన్న సంకల్పం మొన్నటి కేంద్ర బడ్జెట్‌ ప్రసంగంలో వెలుగు చూసింది.

cooperative banks
సహకార బ్యాంకు

By

Published : Feb 7, 2020, 8:08 AM IST

Updated : Feb 29, 2020, 12:00 PM IST

ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ఎవరి స్థాయికి తగ్గట్లు వారు భావి అవసరాల దృష్ట్యా పొదుపు చెయ్యడం మన జాతి జీవన విధానం. మట్టి ముంతలు, కిడ్డీ బ్యాంకుల ద్వారా పిల్లలకు పొదుపు అలవాటు చేసే సమాజంలో- బ్యాంకు అన్నమాటే విశ్వసనీయతకు పర్యాయపదం. కొద్దిపాటి అధిక వడ్డీపై ఆశతో, అది కూడా బ్యాంకే కదా అన్న నమ్మకంతో కష్టార్జితాల్ని సహకార బ్యాంకుల్లో మదుపు చేసిన లక్షలమంది ఖాతాదారుల కొంపలు కొల్లేరయ్యేలా పంజాబ్‌ మహారాష్ట్ర సహకార బ్యాంకు (పీఎంసీ) బాగోతం రచ్చకెక్కి- ఆర్‌బీఐ సహా పలు నిఘా యంత్రాంగాల నిష్ప్రయోజకత్వాన్నే కళ్లకు కట్టింది. అలాంటి దురాకృతాల్ని పునరావృతం కానివ్వరాదన్న సంకల్పం మొన్నటి కేంద్ర బడ్జెట్‌ ప్రసంగంలో వెలుగు చూసింది.

సహకార బ్యాంకుల్లో వృత్తి నైపుణ్యాల్ని పెంచి, పెట్టుబడులకు అవకాశం కల్పించి, ఆర్‌బీఐ నిశిత పర్యవేక్షణ ద్వారా నిర్వహణ తీరుతెన్నుల్ని పెంచేందుకు ‘బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌’కు సవరణలు చెయ్యనున్నట్లు విత్తమంత్రి నిర్మల ప్రస్తావించారు. అందుకు తగ్గట్లే, దేశీయంగా 1,540 సహకార బ్యాంకులకుగల 8.6 కోట్లమంది ఖాతాదారుల ప్రయోజనాల్ని పరిరక్షించేందుకు వీలుగా ఆర్‌బీఐకి వాటి క్రమబద్ధీకరణ అధికారాలు దఖలుపరచే కీలక చట్టసవరణను మోదీ సర్కారు ఆమోదించిందిప్పుడు! సహకార బ్యాంకుల యాజమాన్య అంశాల్ని లోగడ మాదిరే కో ఆపరేటివ్‌ రిజిస్ట్రార్‌ చూస్తారని, బ్యాంకుల క్రమబద్ధీకరణకు ఆర్‌బీఐ వెలువరించే మార్గదర్శకాల్ని ఇకపై సహకార బ్యాంకులు ఔదలదాల్చాల్సి ఉంటుందని చెబుతున్నారు. వాణిజ్య బ్యాంకుల తరహాలోనే ఇకపై ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) నియామకానికి సహకార బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి తప్పనిసరి! ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం క్రమంతప్పక ఆడిటింగ్‌ ప్రక్రియా చేపట్టాల్సి ఉంటుంది. బలహీన సహకార బ్యాంకుల అజమాయిషీని చేపట్టేందుకూ ఆర్‌బీఐకి అధికారం దఖలుపడనుంది. అక్రమార్కుల స్వాహాకారంగా దిగజారి పరువుమాస్తున్న సహకార బ్యాంకులకు తాజా సంస్కరణల చికిత్స, అసలు ఏనాడో జరగాల్సింది!

నగరాలు పట్టణ ప్రాంతాల్లోని చిన్నతరహా పరిశ్రమలు, చిల్లర వర్తకులు, ఛోటా పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులు, స్థిరాదాయ వర్గాలకు ఆర్థిక సేవలందించడానికి అర్బన్‌ సహకార బ్యాంకుల్ని లక్షించారు. సరైన మార్గంలో నడిస్తే వాణిజ్య బ్యాంకుల పొడ పడని చోటా ఆర్థిక నవోత్తేజానికి ఊపిరులూదగల వ్యవస్థ స్వార్థపర శక్తుల చేతిలో చిక్కి- అభాగ్య మదుపరుల పుట్టిని నిలువునా ముంచుతోంది. తగినంత మూలధనం లేకపోవడం, బోగస్‌ సభ్యత్వం, రుణ మంజూరు అధికారాల కేంద్రీకరణ, అస్మదీయులకు అడ్డగోలుగా రుణ పందేరాలు, వసూళ్లపై దృష్టిసారించకపోవడం వంటివి అర్బన్‌ సహకార బ్యాంకుల అవ్యవస్థకు మూల హేతువులని నరసింహమూర్తి కమిటీ ఏనాడో విశ్లేషించింది.

ఒకవంక ఆ జాడ్యాలు అలా కొనసాగుతుండగానే, బ్యాంకుల సంఖ్య, డిపాజిట్ల పరిమాణం ఊహాతీతంగా విస్తరించాయి. 1991లో దేశవ్యాప్తంగా పట్టణ సహకార బ్యాంకుల సంఖ్య 1,307, డిపాజిట్లు రూ.8,600 కోట్లు! 2004 నాటికి బ్యాంకులు 2,105కు, డిపాజిట్లు ఏకంగా లక్ష కోట్ల రూపాయలకు చేరాయి. వరస వైఫల్యాలతో బ్యాంకుల సంఖ్య నేడు 1,540కి దిగి వచ్చినా డిపాజిట్లు త్రివిక్రమావతారం దాల్చి అయిదు లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయి. అందుకు తగ్గట్లే కుంభకోణాల ఉరవడీ భీతిల్లజేస్తోంది. రూ.11,600 కోట్ల పైచిలుకు డిపాజిట్లతో ఏడు రాష్ట్రాలకు విస్తరించిన పీఎంసీ బ్యాంకు తన ఆస్తుల్లో 70శాతానికిపైగా, అంటే రూ.6,500 కోట్ల మొత్తాన్ని హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు దోచిపెట్టడానికి 21వేల పైచిలుకు నకిలీ ఖాతాలు సృష్టించిన వైనం దిగ్భ్రాంతపరచింది. ఇప్పటికే ఆర్‌బీఐ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న బ్యాంకుల సంఖ్య పాతికకు చేరిన నేపథ్యంలో- అక్రమాల ఉరవడికి అడ్డుకట్టపడాలంటే, చట్టబద్ధంగానే పటిష్ఠ బిగింపులు ఉండి తీరాలి!

సహకార బ్యాంకింగ్‌ రంగాన్ని పట్టి పల్లారుస్తున్న రుగ్మతలకు అసలు కారణం- ఉమ్మడి నియంత్రణ వ్యవస్థేనని కేంద్రం ఏనాడో 2002లోనే గుర్తించింది. రాత్రికి రాత్రి బ్యాంకులు బోర్డులు తిప్పేసిన సందర్భాల్లో- తమ బాధ్యత ఏమీ లేదన్నట్లుగా అటు కో ఆపరేటివ్‌ రిజిస్ట్రార్‌, ఇటు రిజర్వ్‌ బ్యాంక్‌ పరస్పరం వేలెత్తి చూపడమూ పరిపాటిగా మారింది. ఫైనాన్స్‌ బ్యాంకింగ్‌, ఆడిట్‌ రంగాలకు చెందిన నిపుణులతో ఆయా బ్యాంకుల మేనేజిమెంట్‌ బోర్డులు పరిపుష్టం కావాలని, షెడ్యూలు బ్యాంకుల కన్నా రెండు శాతానికి మించి వడ్డీ ఇవ్వకుండా కట్టడి చేయాలని, డిపాజిట్‌ బీమాను రెండున్నర లక్షల రూపాయల దాకా విస్తరించాలన్న మేలిమి సూచనలు పదహారేళ్లుగా పోగుపడి ఉన్నాయి. డిపాజిట్‌ బీమాను తాజా బడ్జెట్లో లక్షనుంచి అయిదు లక్షల రూపాయలకు పెంచిన కేంద్ర ప్రభుత్వం- సహకార బ్యాంకులపై చెదురుతున్న ఖాతాదారుల విశ్వాసాన్ని గాడిన పెట్టేందుకు వడివడిగా అడుగులు కదుపుతోంది.

సహకార సంఘాల చట్టానికి నేరుగా రాజ్యాంగం దన్ను ఉన్నందున- దాన్ని మీరలేం కాబట్టి, వాణిజ్య బ్యాంకుల బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌కు ఉన్న అధికారాలను సహకార బ్యాంకులు తమ ‘బోర్డ్‌ ఆఫ్‌ మేనేజిమెంట్‌’కు దఖలుపరచాలని రిజర్వ్‌ బ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌ గాంధీ నేతృత్వంలోని కమిటీ మొన్నా మధ్య సూచించింది. వందకోట్ల రూపాయల డిపాజిట్లు పైబడిన సహకార బ్యాంకులు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌తో పాటు మేనేజిమెంట్‌ బోర్డునూ ఏర్పాటు చేయాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ ఏడాది మొదట్లో మార్గదర్శకాలు వెలువరించింది. పటిష్ఠ విధివిధానాలు, పటుతర వ్యవస్థల కూర్పుతోపాటే, నిఘా వ్యవస్థనూ బలోపేతం చేసినప్పుడే సహకార బ్యాంకుల్లో ‘కాయ తొలుచు పురుగుల చీడ’ విరగడ అయ్యేది!

Last Updated : Feb 29, 2020, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details