New Iphone 2022: యాపిల్ ఉత్పత్తులకు మార్కెట్లో ఉండే డిమాండ్ గురించి తెలిసిందే. ధర ఎక్కువగా ఉన్నా ఒక్కసారైనా వాటిని ఉపయోగించాలని చాలా మంది ఆశపడుతుంటారు. గతేడాది ఐఫోన్ 13 సిరీస్‌తోపాటు, మరికొన్ని యాపిల్ ఉత్పత్తులను విడుదల చేసింది. అలానే యాపిల్ ఈ ఏడాది ఐఫోన్ 14 వెర్షన్‌తోపాటు, ఐఫోన్ మిడ్-రేంజ్ వేరియంట్ ఎస్ఈ 3ను తీసుకురానుంది.
ఈ మోడల్స్‌కు సంబంధించిన ఫీచర్లను యాపిల్ పాపులర్ టిప్‌స్టర్ మింగ్ చి కూ వెల్లడించారు. మరి వీటిలో ఎలాంటి ఫీచర్లు రానున్నాయో చూద్దాం!
ఐఫోన్ ఎస్ఈ3
2020 నుంచి ఎస్ఈ వేరియంట్‌ను అప్డేట్ చేయలేదు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలకానున్న ఎస్ఈ3 వేరియంట్ కోసం ఐఫోన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మోడల్ ఐఫోన్ ఎక్స్ఆర్ను పోలి ఉంటుందట. తొలుత ఇందులో నాచ్లెస్ డిస్ప్లే ఉంటుందనే వార్తలు వెలువడ్డాయి. తాజా సమాచారం ప్రకారం ఫేస్ ఐడీ ఫీచర్‌తో 5.69 అంగుళాల హెచ్డీ రెటీనా నాచ్ డిస్ప్లే ఇస్తున్నారట. వెనుక 12 ఎంపీ, ముందు 7 ఎంపీ కెమెరాలుంటాయని సమాచారం. 5జీ సపోర్ట్‌తో ఏ15 బయోనిక్ చిప్ ఉపయోగించారని తెలుస్తోంది. ఈ మోడల్‌ను 128 జీబీ మెమొరీ వేరియంట్లో మాత్రమే తీసుకొస్తున్నారట. మార్చి నెలలో జరిగే యాపిల్ వర్చువల్ ఈవెంట్లో ఐఫోన్ ఎస్ఈ3ను విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఐఫోన్ 14 సిరీస్
ఈ సారి ఐఫోన్ 14లో మినీ వేరియంట్ ఉండదనే ఊహగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కేవలం ఐఫోన్ 14, ఐఫోన్ 14 మాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడల్స్‌ను మాత్రమే విడుదలవుతాయని సమాచారం. అలానే ఈ మోడల్స్‌లో సాధారణ సిమ్‌కు బదులు ఈ-సిమ్ ఫీచర్‌ను పరిచయం చేయనున్నారు. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో ప్రో మోషన్ నాచ్లెస్ డిస్ప్లే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు విడులైన ఐఫోన్ మోడల్స్‌లో కేవలం ప్రో వేరియంట్లలో మాత్రమే ఈ డిస్ప్లేను ఇచ్చారు. అలానే ఐఫోన్ 14 ఫోన్లలో అల్ట్రా-స్మూత్ వ్యూయింగ్, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేలా డిస్ప్లేను రూపొందించారట.
ఈ ఏడాది విడుదలయ్యే ఐఫోన్ 14 మోడల్స్‌లో 6 జీబీ ర్యామ్ ఉంటుందట. ఫోన్ల ధరలు తగ్గించాలనే భావనతో యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 14 సిరీస్‌లో వెనుకవైపు 48 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు, 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, టెలీ లెన్స్ అమర్చినట్లు సమాచారం.
ఐఫోన్ 13 తరహాలోనే వీటిలో కూడా శాటిలైట్ నెట్వర్క్ కనెక్టివిటీ ఫీచర్ ఉంటుందట. ఈ ఫోన్లలో యాపిల్ 5ఎన్ఎమ్ ఏ 16 బయోనిక్ చిప్ ఉపయోగించారని తెలుస్తోంది. ఐఫోన్ 14, 14 ప్రో మోడల్స్‌లో 6.1 అంగుళాల డిస్ప్లే, మాక్స్, ప్రో మాక్స్ మోడల్స్‌లో 6.7 అంగుళాల డిస్ప్లే ఇస్తున్నారట.
ఇదీ చూడండి:విపణిలోకి టాటా సఫారీ 'డార్క్' ఎడిషన్.. ధర ఎంతంటే?