తెలంగాణ

telangana

ETV Bharat / business

వారమైనా.. ఇ-ఫైలింగ్ పోర్టల్‌తో తప్పని తంటాలు - ఆదాయపన్ను చెల్లింపుల్లో ఇబ్బందులు

పన్ను చెల్లింపులను సులభతరం చేసేలా ఐటీ శాఖ కొత్తగా తీసుకువచ్చిన ఇ-ఫైలింగ్​ పోర్టల్​ సాంకేతిక కారణాలతో సతమతమౌతోంది. దీంతో చార్టర్డ్​ అకౌంటెంట్లు పన్ను చెల్లింపునకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ఐటీ పోర్టల్​
income tax portal

By

Published : Jun 14, 2021, 5:14 PM IST

ఆదాయపు పన్ను విభాగం నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన కొత్త ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌ పన్ను చెల్లింపుదారులకు ఇంకా చుక్కలు చూపిస్తూనే ఉంది. అందుబాటులోకి వచ్చి వారమైనా సాంకేతిక సమస్యలు ఏర్పడటం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. లాగిన్‌ అవ్వడానికి సైతం సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతోందని పలువురు చార్టర్డ్​ అకౌంటెంట్లు చెబుతున్నారు.

పన్ను రిటర్నులు దాఖలు చేయడాన్ని సులభతరం చేస్తున్నామని పేర్కొంటూ జూన్‌ 7న కొత్త పోర్టల్‌ http://www.incometax.gov.inను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తొలిరోజే దీనిపై సోషల్‌ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందిస్తూ వెంటనే సమస్యలను పరిష్కరించాలని పోర్టల్‌ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఇన్ఫోసిస్ ఛైర్మన్‌ నందన్‌ నీలేకనికి సూచించారు. ఇన్ఫోసిస్‌ దానిపై పనిచేస్తోందని ఆయన బదులిచ్చారు. ఇదంతా జరిగి వారం గడుస్తున్నా ఇంకా సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నాయని, పలు ఫీచర్లు పనిచేయడం లేదని పలువురు చార్టర్డ్ అకౌంటెంట్లు పేర్కొంటున్నారు.

ఐటీ శాఖ కొత్త పోర్టల్​

లాగిన్‌కే సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతోందని ఓ సీఏ తెలిపారు. దాదాపు 10 నుంచి 15 నిమిషాలు పడుతోందని చెప్పారు. 'ఈ- ప్రొసీడింగ్స్‌' విభాగంలోకి వెళ్తుంటే 'కమింగ్‌ సూన్‌' అనే సందేశం కనిపిస్తోందని మరొకరు తెలిపారు. కొత్త పోర్టల్‌ వేగంగా ఉంటుందనుకుంటే మునుపటి కంటే నెమ్మదిగా ఉందని, పాత ఫీచర్లు సైతం సరిగా పనిచేయడం లేదని మరొకరు వాపోయారు. పాస్‌వర్డ్‌ మార్చాలన్నా కొన్ని నిమిషాల పాటు వేచి చూడాల్సి వస్తోందని మరొకరు చెప్పారు. గతంలో దాఖలు చేసిన ఇ-ఫైలింగ్‌ రిటర్నులు కూడా కనిపించడం లేదని పలువురు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పోర్టల్‌లోని సాంకేతిక సమస్యలను తొలగించాలని వారు కోరుతున్నారు.

ఇదీ చూడండి:భారీగా కుదేలైన అదానీ షేర్లు.. కారణమిదే!

ABOUT THE AUTHOR

...view details