తెలంగాణ

telangana

ETV Bharat / business

వినియోగదారుల్ని మోసగిస్తే జైలు ఖాయం - ccpa latest news

కల్తీ వస్తువులతో వినియోగదారులను మోసగిస్తే జైలుకు వెళ్లకతప్పదు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వినియోగదారుల హక్కుల చట్టం-2019.. సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. కల్తీ వస్తువులతో మరణానికి కారణమైతే ఏకంగా జీవిత ఖైదే. ఈ చట్టం గురించి పూర్తి వివరాలు..మీ కోసం

New Consumer Protection Act
వినియోగదారుల్ని మోసగిస్తే జైలు ఖాయం

By

Published : Jul 21, 2020, 7:34 AM IST

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. వినియోగదారుల హక్కుల చట్టం -1986 స్థానంలో ఇప్పుడు 2019 నాటి చట్టం అమల్లోకి వచ్చింది. వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడే తయారీదారులు, వ్యాపారులకు జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశాన్ని ఈ కొత్త చట్టం కల్పిస్తుంది. వివాదాలను పరిష్కరించే పరిపాలన వ్యవస్థను ప్రక్షాళించి దీనికింద కొత్త వ్యవస్థను ఏర్పాటుచేశారు. వస్తువులు, సేవల ధరలు, నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత గురించి వాస్తవమైన విషయాలను వినియోగదారులకు చెప్పాలి. సరసమైన ధరల్లో విభిన్న రకాల వస్తువులను అందుబాటులో ఉంచాలి. ఈ చట్టం అమలు బాధ్యతను కేంద్ర వినియోగదారుల హక్కుల సంరక్షణ ప్రాధికార సంస్థ చూస్తుంది. దీని ఆధ్వర్యంలో ఒక డైరెక్టర్‌ జనరల్‌ నేతృత్వంలో పనిచేసే దర్యాప్తు(ఇన్వెస్టిగేటివ్‌) విభాగం కూడా ఉంటుంది. వినియోగదారుల వివాదాల పరిష్కారానికి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయుల్లో కమిషన్లు ఏర్పాటు చేయనున్నారు. రూ.కోటి వరకు విలువైన వివాదాలను జిల్లా, రూ.10 కోట్లవరకు రాష్ట్ర, రూ.10 కోట్ల పైనున్న వివాదాలను జాతీయస్థాయి కమిషన్లు విచారించి తీర్పులు వెలువరిస్తాయి.

ఈ-కామర్స్‌ వినియోగదారులకు మరింత భద్రత

కొత్త చట్టం ప్రకారం ఇకమీదట ఈకామర్స్‌ సంస్థలు తప్పనిసరిగా రిటర్న్‌, రీఫండ్‌, ఎక్స్ఛేంజ్‌, వ్యారెంటీ, గ్యారెంటీ, డెలివరీ, షిప్‌మెంట్‌, చెల్లింపు విధానాలు, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం, చెల్లింపు విధానాలకు కల్పించిన భద్రత గురించి వినియోగదారులకు స్పష్టమైన సమాచారమివ్వాలి. అందులో విక్రయించే వస్తువులు ఏయే దేశాలకు చెందినవో పేర్కొనాలి. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందిన 48 గంటల్లో ధ్రువీకరణపత్రం ఇవ్వడంతో పాటు నెలరోజుల్లోపు పరిష్కరించాలి.

శిక్షలు.. జరిమానాలు

  • జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్లు జారీ చేసే ఉత్తర్వులు అమలు చేయని వారికి కనీసం నెల నుంచి మూడేళ్లవరకు జైలుశిక్ష, రూ.25 వేల నుంచి రూ.లక్షవరకు జరిమానా విధించొచ్చు.
  • కేంద్ర వినియోగదారుల హక్కుల ప్రాధికార సంస్థ తన ఆధ్వర్యంలోని ఇన్వెస్టిగేటివ్‌ విభాగంతో జరిపించిన దర్యాప్తులో వ్యాపారులు, తయారీదారులు తప్పుచేసినట్లు తేలితే బాధ్యులైన వారికి 6 నెలల జైలుశిక్ష, రూ.20 లక్షలవరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
  • మోసపూరిత ప్రకటనలు ఇచ్చే వారికి రెండేళ్లవరకు జైలుశిక్ష, రూ.లక్షవరకు జరిమానా విధించొచ్చు. ఇలాంటి తప్పులు పదేపదే చేస్తే జైలుశిక్షను అయిదేళ్లు, జరిమానాను రూ.50 లక్షలవరకు పొడిగించొచ్చు.
  • కల్తీ వస్తువుల వల్ల వినియోగదారుడికి గాయాలు కాకపోయినా వాటిని విక్రయించిన వారికి 6నెలల శిక్ష, రూ.లక్షవరకు జరిమానా ఉంటుంది. ఒకవేళ వినియోగదారుడికి గాయాలైతే అలాంటి కేసుల్లో విక్రేతలకు ఏడాది వరకు జైలు, రూ.3 లక్షలవరకు జరిమానా విధిస్తారు.
  • తీవ్రగాయాలైతే అందుకు బాధ్యులైన వారికి ఏడేళ్ల వరకు శిక్ష, రూ.5లక్షలవరకు జరిమానా, వినియోగదారుడు మరణిస్తే.. బాధ్యులైన వ్యక్తులకు జైలు శిక్ష ఏడేళ్ల నుంచి జీవితఖైదు పడుతుంది. రూ.పది లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధించొచ్చు.

ఇదీ చూడండి:హోల్​సేల్ ధరలు తగ్గినా.. రిటైల్​ రేట్లకు రెక్కలు ఎందుకు?

ABOUT THE AUTHOR

...view details