తెలంగాణ

telangana

ETV Bharat / business

అక్టోబర్‌ 1 నుంచి వచ్చిన మార్పులు తెలుసా..?

మీ డెబిట్‌/క్రెడిట్‌ కార్డు ఫ్రాడయ్యిందా? ఎక్కడో ఉండి కేటుగాళ్లు మీ డబ్బులు కొట్టేశారా? ఇక నుంచి అలాంటి వాళ్ల ఆటలు సాగవు. ఎవరైనా అర్జెంటుగా పదివేలు కావాలని కార్డు తీసుకుని లక్షల రూపాయలు వాడేశారా? ఇకపై అలాంటివీ కుదరవు. ఈ తరహా మోసాలకు అవకాశం లేకుండా మీ కార్డులను లాక్‌ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇదే కాదు వాహనదారుల ధ్రువపత్రాలు, టీవీల ధరలు, పెట్రోల్‌ పంపుల్లో చెల్లింపులకు సంబంధించి కొన్ని నిబంధనలు గురువారం నుంచే కొత్తగా అమల్లోకి వచ్చాయి. అవేంటో చూసేయండి..

New changes in business from october 1st 2020
అక్టోబర్‌ 1 నుంచి వచ్చిన మార్పులు తెలుసా?

By

Published : Oct 1, 2020, 8:27 PM IST

సైబర్‌ నేరాలను నియంత్రించేందుకు ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌ లావాదేవీలు, కార్డు చెల్లింపులను సురక్షితంగా మార్చేందుకు.. నయా నిబంధనలను ప్రవేశపెట్టింది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల క్లోనింగ్‌కు అడ్డుకట్ట పడేలా నిర్ణయం తీసుకుంది. ఆయా కార్డు వాడకం దారుల ఇష్టానికి అనుగుణంగా.. కార్డుదారులకు వెసులుబాటు కల్పించింది. కార్డుదారు కోరుకుంటే తప్ప అంతర్జాతీయ లావాదేవీలకు వీల్లేదు. డెబిట్‌/క్రెడిట్‌ కార్డులను ఏటీఎంలు, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ వద్ద లావాదేవీలు నిర్వహించుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. ఇప్పుడు పరిమితి విధించుకోవడానికి కొత్తగా అవకాశం కల్పించింది.

  • వాహనదారులకు కాగితాలు చూపించే చిక్కులు తప్పాయి. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీ వంటి ధ్రువపత్రాలు నేరుగా చూపించాల్సిన అవసరం లేదు. వాహనాలు నడిపేటప్పుడు డిజిటల్​(సాఫ్ట్​) కాపీ ఉంటే సరిపోతుంది. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ మోటారు వాహనాల నిబంధనలు చట్టానికి(1989) సవరణల నియమాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి.
    టీవీ సెట్లు
  • విదేశాల నుంచి టీవీ సెట్లు కొనడం ఇకపై భారం కానుంది. ఓపెన్‌ సెల్‌ ప్యానెళ్ల దిగుమతిపై 5శాతం సుంకం విధిస్తుండటమే ఇందుకు కారణం. దిగుమతి సుంకం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
  • కొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు రూట్‌ నావిగేషన్‌ కోసం మొబైల్ ఫోన్లు వాడొచ్చు. డ్రైవర్‌ ఏకాగ్రతకు భంగం కలగనీయని రీతిలో రూట్‌ నావిగేషన్‌ను ఉపయోగించొచ్చని కేంద్రం స్పష్టంచేసింది.
    పెట్రోల్​ పంపులు
  • పెట్రోల్‌ పంపుల్లో క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లింపులపై ఇకపై ఎలాంటి రాయితీ ఉండబోదు. డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రోత్సహించడంలో భాగంగా ఇన్నాళ్లూ క్రెడిట్‌/డెబిట్‌ కార్డులు, వాలెట్ల ద్వారా చెల్లింపులపై రాయితీ ఇచ్చేవారు. ఇకపై క్రెడిట్‌ కార్డులపై ఆ రాయితీ వర్తించదు. మిగిలిన వాటిపై యథావిధిగా కొనసాగనున్నాయి.
  • ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద పేదలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌ పొందేందుకు ఉద్దేశించిన గడువు ముగిసింది. ఇకపై పీఎంయూవై కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పొందే అవకాశం లేదు.
    స్వీట్​ షాపులు
  • స్వీట్‌ షాపుల్లోనూ అక్టోబర్​ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అమ్మకందారులు గరిష్ఠ కాలపరిమితి తేదీలను ప్రదర్శించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఎప్పటిలోగా స్వీట్లు తినొచ్చో తెలియజేయాలి. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
  • ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల్లోనూ కొత్త మార్పులొచ్చాయి. పాలసీల్లో మార్పులు చేసే నిర్ణయాన్ని బీమా సంస్థలకే వదిలేసింది ఐఆర్‌డీఏఐ. 30 రోజుల్లో క్లెయిం చెల్లించడం, తిరస్కరించడం చేయాలని, లేదంటే అన్ని పత్రాలు అందిన నాటి నుంచి.. బ్యాంకు వడ్డీ కంటే 2 శాతం అధికంగా వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
  • విదేశాలకు నిధుల బదిలీపై నేటి నుంచి 5 శాతం పన్ను భారం పడనుంది.
  • ఆవ నూనెను ఇతర వంట నూనెల్లో కలిపి వాడడంపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ మేరకు విధించిన నిషేధం అక్టోబర్​ 1నుంచి అమల్లోకి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details