దివంగత పాప్ గాయకుడు మైకేల్ జాక్సన్‌కు చెందిన 'ది నెవర్‌ల్యాండ్ ఎస్టేట్'ను విక్రయించేశారు. జాక్సన్ మాజీ స్నేహితుడు రోన్ బుర్కిలీ లాస్ ఓలివోస్‌లోని ఈ ఎస్టేట్‌ను కొనుగోలు చేశారు. దీని కోసం ఆయన 22 మిలియన్ డాలర్లను చెల్లించారు. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక వెల్లడించింది. 2,700 ఎకరాల్లో విస్తరించిన ఈ ఎస్టేట్ విలువను 2015లో 100మిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. ఆ తర్వాత కూడా పలు మార్కెట్లలో విక్రయానికి ప్రయత్నించి విలువ లెక్కించారు. గతేడాది దీని విలువ 31 మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.
వాస్తవానికి జాక్సన్ దీనిని 1987లో 19.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. పీటర్స్ పాన్ స్టోరీలోని ఊహాత్మక ద్వీపం గుర్తుకువచ్చేలా నెవర్‌ల్యాండ్ అని పేరుపెట్టారు.
వివాదాలకు కేంద్రంగా..
జాక్సన్ దీనిని అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దాడు. దీనిలో ఎంటర్‌టైన్‌మెంట్ కాంప్లెక్స్, జూ వంటివి ఏర్పాటు చేశాడు. తరచూ ఇక్కడ పిల్లలు, వారి కుటుంబసభ్యులతో సరదాగా గడిపేవాడు. 1990-2000 మధ్యలో పలు దర్యాప్తులు, వివాదాలకు కూడా ఇది కేంద్రమైంది. ఇదే సమయంలో పిల్లలతో జాక్సన్ అసభ్యకరంగా ప్రవర్తించేవాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 2005లో కూడా ఇలాంటి ఆరోపణలు రావడంతో లాస్‌ఏంజెల్స్‌లోని ఇంటికి మారిపోయాడు. ఆ తర్వాత నెవర్‌ల్యాండ్‌కు ఎప్పుడూ తిరిగి రాలేదు. 2009లో జాక్సన్ కన్నుమూశాడు. జాక్సన్ మరణం తర్వాత నెవర్‌ల్యాండ్‌లో భారీ మార్పులు చోటు చేసుకొన్నాయి. సైకామోర్ వ్యాలీగా దీనిని రీబ్రాండ్ చేశారు.
ఇదీ చూడండి:రికార్డు స్థాయిలో రూ.80కోట్లు దాటిన ఫాస్టాగ్ వసూళ్లు