ఇన్నోవేషన్ రంగంలో దేశంలోని పలు రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మాటను నిజం చేస్తూ మహిళా ఇన్నోవేషన్‌కు మరింత చేయూతనిచ్చేందుకు తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలు భాగస్వామ్య ఒప్పందంతో ముందుకొచ్చాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల్లోని మహిళా స్టార్టప్‌లకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ఆధ్వర్యంలోని వీ-హబ్... గుజరాత్‌లోని ఐ-హబ్‌లు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
కుదిరిన ఒప్పందం...
ఈ ఒప్పందంలో భాగంగా ఇరు రాష్ట్రాలకు చెందిన 240 స్టార్టప్‌లను ఎంపిక చేసి, వాటికి అవసరమైన అన్ని రకాల చేయూతను అందించనున్నారు. తద్వారా ఆయా స్టార్టప్‌లు మరింత మూలధనాన్ని అందిపుచ్చుకోవటమే కాక, అవసరమైన మెంటర్ షిప్ వీరికి దొరకనుంది.
పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, గుజరాత్ విద్యాశాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖల మంత్రులు భూపేంద్ర సిన్హా, విభావరి బెన్దవేల సమక్షంలో వీహబ్ సీఈవో దీప్తిరావుల, తెలంగాణ, గుజరాత్‌కు చెందిన సీనియర్ అధికారులు ఈ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.