రిటైల్ రంగ ఉన్నతి కోసం తీసుకురాబోతున్న సమన్వయ జాతీయ రిటైల్ విధానంతో 2024 నాటికి దేశంలో అదనంగా 30 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగే అవకాశం ఉందని సీఐఐ జాతీయ కమిటీ ఛైర్మన్, ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్ రిటైల్-ఎఫ్ ఎమ్సీజీ అధిపతి శాశ్వత్ గోయెంకా వెల్లడించారు. సీఐఐ ఇండియా రిటైల్ సమ్మిట్-2020లో పాల్గొన్న ఆయన రిటైల్ రంగంపై మాట్లాడారు.
"పరిశ్రమను ముందుకు నడిపించేందుకు కొత్త, అభివృద్ధి చెందుతున్న నమూనాలపై చర్చించాల్సిన అవసరం ఉంది. గిరాకీ తగ్గడం వల్ల పరిశ్రమ ఇప్పటికీ దెబ్బ తింటోంది కాబట్టి వినియోగదార్ల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు చురుకైన చర్యలు తీసుకోవాలి" అని గోయెంకా వివరించారు. రిటైల్ మౌలిక వసతులపై గిడ్డంగులు, శీతలీకరణ కేంద్రాలపై రూ.6,500 కోట్ల మేర పెట్టుబడులు పెడితే మరో 2-3 లక్షల ఉద్యోగాలను సృష్టించవచ్చని అభిప్రాయపడ్డారు. 2021 నుంచి 2027 నాటికి రిటైల్ రంగ పరిణామం రెండింతలు అవుతుందని అంచనా వేశారు.