ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఓ ఆసక్తికర సందర్భం చోటుచేసుకుంది. కార్యక్రమంలో భాగంగా టాటాకు అవార్డు ప్రదానం చేసిన నారాయణ మూర్తి.. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.
రతన్ టాటాకు నారాయణ మూర్తి పాదాభివందనం - ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, పారిశ్రామికవేత్త రతన్ టాటాల మధ్య ఆసక్తికర సందర్భం చోటుచేసుకుంది. ఓ కార్యక్రమంలో భాగంగా టాటాకు అవార్డు ప్రదానం చేసిన నారాయణ మూర్తి... ఆయన పాదాలకు నమస్కరించారు. వైరల్ అవుతున్న ఈ ఫొటోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
టైకాన్ 11వ వార్షిక అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబయిలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా రతన్ టాటాను జీవనకాల సాఫల్య పురస్కారంతో సత్కరించారు. నారాయణ మూర్తి చేతుల మీదుగా టాటా ఈ అవార్డును అందుకున్నారు. అవార్డును ప్రదానం చేసిన తర్వాత నారాయణమూర్తి.. టాటా పాదాలను తాకారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను టైకాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘హృదయాన్ని హత్తుకునే మానవత్వం.. ఇదో చారిత్రక క్షణం’ అని కొనియాడింది. అటు రతన్ టాటా కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ ఫొటోలను పోస్ట్ చేశారు. ‘గొప్ప స్నేహితుడైన నారాయణమూర్తి నుంచి అవార్డు అందుకోవడం గర్వంగా ఉంద’ని సంతోషం వ్యక్తం చేశారు.
కాగా.. ఈ ఫొటోలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ‘విలువలను చూపించిన లెజెండ్స్.. కార్పొరేట్ చరిత్రలో గొప్ప క్షణం.. భారత సంప్రదాయంలో ఇతరులను గౌరవించడం కంటే మించింది ఇంకేం లేదు..’ అని కామెంట్లు పెడుతున్నారు.