తెలంగాణ

telangana

ETV Bharat / business

సరికొత్త ఆవిష్కరణలతో మ్యూచువల్ ఫండ్స్​- ఇవి తెలుసుకోండి.. - indian business

Mutual Fund New Stratagies: పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు కొత్త ఆవిష్కరణలతో వస్తూనే ఉంటాయి. కొత్త ఫండ్లు విడుదల, ఫండ్లకు కొన్ని ప్రయోజనాలను జోడించడంలాంటివి చూస్తుంటాం. వీటితోపాటు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మదుపరులకు జీవిత బీమా రక్షణ అందించడమూ ప్రారంభించాయి. పెట్టుబడి, బీమా ఏకకాలంలో లభించే ఈ వెసులుబాటుతో ఎంత లాభం? మనమేం చూడాలి? తెలుసుకుందాం.

mutual funds
మ్యూచువల్‌ ఫండ్‌

By

Published : Mar 4, 2022, 10:51 AM IST

Mutual Fund New Stratagies: క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) మదుపరులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా బృంద జీవిత బీమా పాలసీ రక్షణను అందించేందుకు ఫండ్‌ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. 18-51 ఏళ్ల లోపు ఉన్నవారికి ఈ బీమా అందుతుంది. ఆర్థిక ప్రణాళికలో కీలకమైన పెట్టుబడి, బీమా ఒకే చోట అందుతున్నా.. దీనికి ఉన్న పరిమితులను మనం అర్థం చేసుకోవాలి.

మూడేళ్లు దాటితేనే...

పెట్టుబడి ద్వారా బీమా అందుకోవాలంటే సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) కనీస వ్యవధి మూడేళ్లు ఉండాలి. సిప్‌ను మధ్యలో రద్దు చేసినా, పెట్టుబడి ఉపసంహరించుకున్నా ఇతర పథకంలోకి మారినా ఈ రక్షణ దూరం అవుతుంది. మూడేళ్ల తర్వాత సిప్‌ చేయడం ఆపేసినా గరిష్ఠ వయసు 55-60 ఏళ్ల నిండేదాకా బీమా వర్తిస్తుంది.

ఎంత మొత్తం..

బీమా పాలసీ విలువ సిప్‌ మొత్తంపైనే ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఇది మొదటి సంవత్సరం సిప్‌ మొత్తానికి 10 రెట్ల వరకూ ఉంటుంది. రెండో ఏడాదిలో 50 రెట్లకు పెరుగుతుంది. మూడో ఏడాదిలో 100 రెట్లు అవుతుంది. ఉదాహరణకు మీ సిప్‌ మొత్తం నెలకు రూ.1,000 అనుకుంటే.. మొదటి సంవత్సరం బీమా రక్షణ రూ.10వేలు, రెండో ఏడాదిలో రూ.50,000, మూడో సంవత్సరంలో రూ.లక్ష బీమా విలువ ఉంటుంది.

గరిష్ఠంగా...

మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు అందించే ఈ బృంద బీమా గరిష్ఠ పరిమితి రూ.50లక్షలు. కొన్ని సంస్థలు ఈ గరిష్ఠ పరిమితిని రూ.20లక్షలుగానే నిర్ణయించాయి. సంప్రదాయ టర్మ్‌ పాలసీలకు ఇవి ప్రత్యామ్నాయం కావనే సంగతి ఇక్కడ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా అధిక ఆదాయం ఉన్నవారికి ఇది ఏమాత్రం సరిపోదు.

రుసుములుంటాయి..

వ్యవధికి ముందే పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే.. ఫండ్‌ విలువలో రెండు శాతం వరకూ అమ్మకపు రుసుము (ఎగ్జిట్‌ లోడ్‌) విధిస్తారు. ఆ తరువాత నుంచి బీమా రక్షణా లభించదు. మదుపరులు మరణించిన సందర్భంలోనూ నామినీ వ్యవధికి ముందే పెట్టుబడులను వెనక్కి తీసుకున్నా ఈ రుసుములు ఉంటాయి.

పెట్టుబడి కొనసాగుతుంది..

కొన్ని సంస్థలు అందించే మ్యూచువల్‌ ఫండ్‌ ఆధారిత బీమా పాలసీ పథకాల్లో.. మదుపరి మరణించినా.. నిర్ణీత వ్యవధి వరకూ పెట్టుబడులు కొనసాగే ఏర్పాటు ఉంటుంది. ఇక్కడ మిగిలిన సిప్‌ వాయిదాలను బీమా సంస్థ చెల్లిస్తుంది. నామినీ ఈ స్కీంను కొనసాగించవచ్చు. లేదా క్లెయిం చేసుకునే వీలూ ఉంది.

ఈ తరహా పథకాలను ఎంచుకునేటప్పుడు నియమనిబంధనలను స్పష్టంగా తెలుసుకోవాలి. ఇవి ఫండ్‌ సంస్థలను బట్టి, మారుతూ ఉంటాయి. క్లెయిం చేసుకోవాల్సి వచ్చినప్పుడు నామినీగా ఉన్న వ్యక్తి ఫండ్‌ సంస్థను కాకుండా.. రక్షణ అందిస్తోన్న బీమా సంస్థనే సంప్రదించాలి. వాస్తవానికి బీమా, పెట్టుబడి రెండూ విభిన్నమైనవి. ఈ రెండింటినీ కలిపి చూడకూడదు. కేవలం పెట్టుబడులతో వచ్చే అదనపు ప్రయోజనంగానే ఈ బీమాను భావించాలి.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌.కామ్‌

ఇదీ చదవండి:నిధుల సమీకరణకు వొడాఫోన్‌ ఐడియా బోర్డు ఓకే

ABOUT THE AUTHOR

...view details