తెలంగాణ

telangana

ETV Bharat / business

రిలయన్స్​ స్థాయిలో మరో 30 కంపెనీలు: అంబానీ - Mukesh ambani speech

Mukesh ambani: ఆర్‌ఐఎల్‌ 100 కోట్ల డాలర్ల కంపెనీగా అవతరించడానికి 15 ఏళ్లు పట్టిందని ఆ సంస్థ ​ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు. రిలయన్స్​ స్థాయిలో 20-30 కంపెనీలు రాబోయే 10- 20 ఏళ్లలో దేశీయంగా అభివృద్ధి చెందే వీలుందని పేర్కొన్నారు.

Mukesh ambani
ముకేశ్​ అంబానీ

By

Published : Feb 24, 2022, 8:39 AM IST

Mukesh ambani news: ఇంధనం, టెక్నాలజీ రంగాల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) స్థాయిలో మరో 20-30 కంపెనీలు రాబోయే 10- 20 ఏళ్లలో దేశీయంగా అభివృద్ధి చెందే వీలుందని ఆర్‌ఐఎల్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు. ఆర్‌ఐఎల్‌ 100 కోట్ల డాలర్ల కంపెనీగా అవతరించడానికి 15 ఏళ్లు పట్టిందని తెలిపారు. 1,000 కోట్ల డాలర్ల కంపెనీగా 30 ఏళ్లలో, 10,000 కోట్ల డాలర్ల కంపెనీగా 35 ఏళ్లలో, 20,000 కోట్ల డాలర్ల కంపెనీగా 38 ఏళ్లలో మారినట్లు ముకేశ్‌ వివరించారు. కొత్తతరం కంపెనీలు శరవేగంగా ఎదిగే వీలుందన్నారు. స్వచ్ఛ ఇంధన ఉత్పత్తివైపు దూసుకెళ్తున్న భారత్‌ వచ్చే రెండు దశాబ్దాల్లో 0.5 ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.37,50,000 కోట్ల) ఎగుమతులు చేసే అవకాశం ఉందని అంబానీ వెల్లడించారు. సాంకేతిక పురోగతులు దేశాన్ని అంతర్జాతీయంగా కొత్త ఇంధన అగ్రగామిగా నిలబెడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలవాలని ఆర్‌ఐఎల్‌ భావిస్తోంది. ప్రపంచంలో పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌కు మించిన దేశం లేదన్నారు. హరిత ఇంధనం వైపు అడుగులేస్తున్నా, ప్రస్తుతం 85 శాతం అవసరాలు తీరుస్తున్న బొగ్గు, ముడి చమురుపై మరో 20-30 ఏళ్లు ఆధారపడక తప్పదని వివరించారు. స్వల్ప-మధ్యకాలానికి తక్కువ కర్బన ఉద్గార, కర్బన ఉద్గార రహిత వ్యూహాలను అనుసరించాలని ఆసియా ఎకనామిక్‌ డైలాగ్‌ కార్యక్రమంలో అంబానీ సూచించారు. ‘స్వచ్ఛ ఇంధన తయారీ వ్యయం తగ్గేందుకు సాంకేతికత ఉపయోగపడుతుంది. గ్రీన్‌, క్లీన్‌ ఎనర్జీలో భారత్‌ స్వయం సమృద్ధి సాధించడంతో పాటు అతి పెద్ద ఎగుమతిదారుగా అవతరిస్తే, అంతర్జాతీయ శక్తిగా మారే అవకాశం ఉంది. ఇందువల్ల భారీగా ఉద్యోగాల సృష్టితో పాటు విదేశీ మారకపు నిల్వలు మిగులుతాయి. చమురు శుద్ధి కేంద్రాల నుంచి స్టీల్‌ ప్లాంట్ల వరకు గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీలో పవన-సౌర వంటి పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగిస్తే కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. గత 20 ఏళ్లుగా ఐటీ రంగంలో సూపర్‌పవర్‌గా దూసుకెళ్లిన భారత్‌, రాబోయే 20 ఏళ్లలో ఇంధన, లైఫ్‌సైన్సెస్‌ రంగాల్లో అగ్రగామిగా ఎదుగుతుంద’ని ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. భారతీయ టెక్నాలజీ, డిజిటల్‌ ఎగుమతులు 20 ఏళ్ల కిందట 1,000 కోట్ల డాలర్ల కంటే తక్కువగా ఉన్నాయని, 2030 నాటికి లక్ష కోట్ల డాలర్లను అధిగమిస్తాయని అంచనా వేశారు.

ఇదీ చదవండి:షేర్లు కొంటే మర్నాడే డీ మ్యాట్‌ ఖాతాలో జమ

ABOUT THE AUTHOR

...view details