తెలంగాణ

telangana

ETV Bharat / business

అపరకుబేరుల జాబితాలో ముకేశ్ స్థానం 8 - భారీయ బిలియనీర్ల జాబితా

ప్రపంచవ్యాప్త అత్యంత ధనవంతుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలాన్​మస్క్ అగ్రస్థానంలో నిలిచారు. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ ముకేశ్ అంబానీ ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పదిమంది అత్యంత సంపన్నుల జాబితాలో చోటుదక్కించుకున్న భారతీయుడు ముకేశ్ మాత్రమే కావడం విశేషం. 'హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్ 2021' ప్రకారం ముకేశ్ సంపద దాదాపు రూ.6.09 లక్షల కోట్లు.

Mukesh rank in Global Rich List top 10
ప్రపంచంలో ఎనిమిదో అత్యంత ధనవంతుడిగా ముకేశ్​

By

Published : Mar 2, 2021, 7:06 PM IST

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఎనిమిదో స్థానంలో నిలిచారు. 'హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్ 2021‌' ద్వారా ఈ విషయం తెలిసింది.

భారతీయ బిలియనీర్లు

గత సంవత్సర కాలంలో ఆయన సంపద 24 శాతం ఎగబాకి 83 బిలియన్‌ డాలర్లకు అంటే సుమారు రూ.6.09 లక్షల కోట్లకు చేరింది. ఇక ఈ జాబితాలో రూ.2.34 లక్షల కోట్ల సంపదతో గౌతమ్‌ అదానీ అండ్‌ ఫ్యామిలీ 48వ ర్యాంకు, రూ.1.94 లక్షల కోట్లతో శివ్‌ నాడార్‌ అండ్‌ ఫ్యామిలీ 58వ ర్యాంకు, రూ.1.40 లక్షల కోట్లతో లక్ష్మీ నివాస్‌ మిత్తల్‌ 104వ ర్యాంకు, రూ. 1.35 లక్షల కోట్ల సంపదతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ అధిపతి సైరస్‌ పూనావాలా 113వ ర్యాంకులో నిలిచారు.

హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్ ప్రకారం భారత్‌లో మొత్తం 209 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరిలో 177 మంది భారత్‌లో నివసిస్తున్నారు. గత ఏడాది కాలంలో కొత్తగా పుట్టుకొచ్చిన బిలియనీర్ల విషయంలో అగ్రరాజ్యం అమెరికాతో భారత్‌ పోటీ పడింది. అమెరికాలో మొత్తం 69 మంది కొత్తగా బిలియనీర్ల జాబితాలో చేరగా.. భారత్‌ నుంచి ఆ సంఖ్య 40గా నమోదైంది. ఐటీ సేవల కంపెనీ స్కేలార్‌ సీఈఓ జే చౌదరి సంపద 271 శాతం పెరిగి రూ.96,000 కోట్లకు చేరడం విశేషం. అలాగే అదానీ గ్రూప్‌నకు చెందిన వినోద్‌ శాంతిలాల్‌ అదానీ సంపద 128 శాతం పెరిగి రూ.72,000 కోట్లకు ఎగబాకింది.

అగ్రస్థానంలో ఎలాన్​ మస్క్​..

'హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్' ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్‌ మస్క్‌ నిలిచారు. గత ఏడాది కాలంలో ఆయన సంపద 328 శాతం పెరిగి 197 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఒక్క సంవత్సర కాలంలో ఆయన సంపద ఏకంగా 151 బిలియన్‌ డాలర్లు ఎగబాకింది.

అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌ 189 బిలియన్‌ డా‌లర్లు, ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ వస్తువుల తయారీ కంపెనీ ఎల్‌వీఎంహెచ్‌ ఛైర్మన్‌ బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 114 బిలియన్‌ డాలర్లు, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ 110 బిలియన్‌ డాలర్లు, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ 101 బిలియన్‌ డాలర్లతో వరుసగా తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఏడాది వ్యవధిలో 50 బిలియన్‌ డాలర్లకు పైగా సంపద పోగేసిన వారు కేవలం ముగ్గురే ముగ్గురు కావడం విశేషం. వీరిలో ఒకరు ఎలన్‌ మస్క్‌(151 బిలియన్‌ డాలర్లు), జెఫ్‌ బెజోస్‌(50 బిలియన్‌ డాలర్లు), పిన్‌డ్యువోడ్యువో అధినేత కొలిన్‌ హువాంగ్(50 బిలియన్‌ డాలర్లు) ఉన్నారు.

ఈ జాబితాలో చోటు దక్కిన వారిలో సంవత్సర కాలంలో 161 మంది ఐదు బిలియన్‌ డాలర్లకు పైగా సంపాదించారు. వీరిలో 84 మంది చైనీయులు, 38 మంది అమెరికన్లు, ఐదుగురు భారతీయులు ఉన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details