రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్పుల్లేని సంస్థగా మారడం వల్ల ముకేశ్ అంబానీ అంతర్జాతీయ కుబేరుల్లో టాప్-10లోకి చేరారు. రిలయన్స్ మార్కెట్ విలువ రూ.11 లక్షల కోట్లకు చేరడం వల్ల ముకేశ్ తొమ్మిదో స్థానంలోకి చేరారు. రియల్‌టైం నికర విలువ ప్రకారం తొలి 10 మంది ఎవరో చూద్దామా..
1 జెఫ్ బెజోస్
సంపద 160.1 బిలియన్ డాలర్లు.. అంటే రూ.12 లక్షల కోట్ల సంపదతో అమెజాన్ అధిపతి జెఫ్‌బెజోస్ ప్రపంచంలో నం.1 కుబేరుడిగా ఉన్నారు. 1994లో తన గ్యారేజీలో అమెజాన్‌ను ఏర్పాటు చేసిన ఈయన తన కంపెనీ ద్వారా కరోనా సమయంలోనూ అదనంగా 1,75,000 మందిని నియమించుకోవడం గమనార్హం.
2 బిల్ గేట్స్
బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా బిల్ గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్‌లు కరోనాపై పోరాటానికి 300 మి. డాలర్లు ఖర్చు పెడుతున్నారు. మైక్రోసాఫ్ట్‌లో ఆయన వాటా 1 శాతం కంటే కాస్త ఎక్కువ. అయినప్పటికీ.. గేట్స్ 108.7 బి. డాలర్ల (దాదాపు రూ.8.15 లక్షల కోట్లు) సంపదతో రెండో స్థానంలో ఉండడం విశేషం.
3 బెర్నార్డ్ ఆర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ
70 బ్రాండ్లకు పైగా సామ్రాజ్యాన్ని నడుపుతున్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ 103.2 బి. డాలర్ల (దాదాపు రూ.7.74 లక్షల కోట్లు)తో మూడో స్థానంలో ఉన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన ఈ కంపెనీ 2019 నవంబరులో అమెరికా ఆభరణాల కంపెనీ టిఫానీ అండ్ కోను 16.2 బి. డాలర్లకు కొనుగోలు చేయడం విశేషం.
4 మార్క్ జుకర్‌బర్గ్
2004లో హార్వర్డ్‌లో ఫేస్‌బుక్ సేవలను మొదలుపెట్టిన మార్క్ జుకర్‌బర్గ్ గురించి తెలియని యువత ఉండదేమో. మే 2012న స్టాక్‌మార్కెట్లోకి వచ్చిన ఫేస్ బుక్‌లో మార్క్‌కు 15 శాతం వాటా ఉండడంతో 87.9 బి. డాలర్ల సంపద(దాదాపు రూ.6.5 లక్షల కోట్లు)తో నాలుగో స్థానంలో ఉన్నారీయన.
5 వారెన్ బఫెట్
అత్యంత గొప్ప మదుపర్లలో ఒకరిగా పేరొందిన వారెన్ బఫెట్‌కు 60కి పైగా కంపెనీలున్నాయి. 71.4 బిలియన్ డాలర్ల సంపద(దాదాపు రూ.5.35 లక్షల కోట్లు)తో అయిదో స్థానంలో ఉన్న బఫెట్ తన 11 ఏళ్ల వయసులోనే స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడం విశేషం. 13 ఏళ్ల వయసులో పన్ను రిటర్నులు దాఖలు చేశారు.