భారత్‌లో అగ్రగామి 100 మంది కుబేరుల జాబితాలో వరుసగా 14వ ఏడాది తొలి స్థానంలో నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ సహా అతికొద్ది మందితో కూడిన 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరారు. శుక్రవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్) షేర్ల విలువ రికార్డు స్థాయికి చేరడం వల్ల ముకేశ్ అంబానీ సంపద విలువ 100 బి.డాలర్లు (Mukesh Ambani Net Worth) దాటింది. ఈ ఏడాది ఆయన సంపద 23.8 బి.డాలర్ల మేర పెరగడం విశేషం. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (Bloomberg Billionaires Index 2021) ప్రకారం ప్రస్తుతం ఆయన సంపద విలువ 101 బి.డాలర్లుగా ఉంది.
హరిత ఇంధన రంగంలోకీ ప్రవేశించనున్నట్లు అంబానీ గత జూన్‌లో (Mukesh Ambani News) ప్రకటించారు. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. మరోవైపు 2030 కల్లా పునరుత్పాదక వనరుల నుంచి కనీసం 100 గిగావాట్ల విద్యుదుత్పత్తి సాధిస్తామని పేర్కొన్నారు. ఒక దశాబ్ద కాలంలో 1 కిలో హైడ్రోజన్ వ్యయాన్ని 1 డాలరు లోపునకు తీసుకురావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
అలాగే ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ (Reliance News) ఆదాయంలో సింహభాగమైన ఇంధన వ్యాపారంపైనా ముకేశ్ (Mukesh Ambani News) పటిష్ఠ ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజం ఆరామ్‌కోతో ఒప్పందం (Aramco Reliance Deal) కుదుర్చుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. దాదాపు 73 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయం కలిగిన రిలయన్స్‌లో.. ఇప్పటికీ 60 శాతం వాటా చమురు ఆధారిత ఇంధన వనరులదే. ఈ నేపథ్యంలోనే ఆరామ్‌కోతో ముందుకు వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు.