mukesh ambani cryptocurrency: ప్రతిపాదిత డేటా గోప్యత, క్రిప్టోకరెన్సీ బిల్లులకు భారత కుబేరుడు ముకేశ్ అంబానీ మద్దతు తెలిపారు. ఇందుకోసం ఎంతో ముందుచూపుతో ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తోందని ఇన్ఫినిటీ ఫోరమ్ కార్యక్రమంలో అంబానీ అన్నారు. భారతీయుల డేటాపై నియంత్రణ, యాజమాన్యం మన దేశానికే ఉండాలని, వ్యూహాత్మక డిజిటల్ మౌలిక వసతులను నిర్మించుకోవడానికి, వాటిని పరిరక్షించుకోవడానికి దేశాలకు హక్కు ఉందని అంబానీ అన్నారు. పలు అంశాలపై ఆయన ఏమన్నారంటే..
డేటాతో సమానత్వం
సంప్రదాయ ఇంధనానికి, సరికొత్త డేటా ఇంధనానికి తేడా ఉంది. సంప్రదాయ ఇంధనాన్ని ఎంపిక చేసిన చోట వెలికితీయగలం. అది కొన్ని దేశాలనే సంపన్నం చేస్తుంది. అదే డేటాను ఎవరైనా.. ఎక్కడైనా తయారుచేయొచ్చు.. వినియోగించుకోవచ్చు. అన్ని రంగాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని ఆర్థిక వర్గాల్లో సమానత్వాన్ని తీసుకురాగల సత్తా దీనికి ఉంది.
సరైన దారిలోనే విధానాలు
ఆధార్, డిజిటల్ బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ చెల్లింపుల ద్వారా భారత్ ఇప్పటికే గొప్ప డిజిటల్ వ్యవస్థను తీసుకొచ్చింది. డేటా గోప్యత బిల్లు, క్రిప్టోకరెన్సీ బిల్లులను సైతం ప్రవేశపెడుతున్నారు. మనం సరైన దారిలో ఉన్నాం. ఏకరూప అంతర్జాతీయ ప్రమాణాలను తీసుకొస్తే సరిహద్దు లావాదేవీలు, సమన్వయం, భాగస్వామ్యాలకు ఇబ్బందులు ఉండవు.
బ్లాక్ చెయిన్‌పై నాకు నమ్మకం ఉంది
బ్లాక్ చెయిన్ సాంకేతికతను విశ్వసించే వారిలో నేను ముందుంటాను. క్రిప్టోకరెన్సీకి దీనికి సంబంధం లేదు. ఒక విశ్వాసపూరిత, సమానత్వ సమాజానికి బ్లాక్ చెయిన్ సాంకేతికత అత్యంత అవసరం. బ్లాక్‌చెయిన్ వినియోగం ద్వారా ఎటువంటి లావాదేవీలో అయినా భద్రత, విశ్వాసం, ఆటోమేషన్, సామర్థ్యాన్ని పొందగలం. మన సరఫరా వ్యవస్థల ఆధునికీకరణకూ దీనిని వినియోగించడం ద్వారా ఆర్థిక వ్యవస్థలకు ఊపిరిలూదవచ్చు.
భారీ మార్పులు వస్తాయ్
దేశంలో ఆప్టికల్ ఫైబర్, క్లౌడ్, డేటా కేంద్రాలను సమకూర్చుకున్నాం. ఇక తదుపరి అడుగు యంత్రాలు, పరికరాలు, వాహనాలను అనుసంధానం చేయడమే. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ద్వారా సాధ్యం. వచ్చే ఏడాది ఆవిష్కృతమయ్యే 5జీ ద్వారా ఇది సాకారమవుతుంది. ఆర్థిక నమూనాను వికేంద్రీకరించడంలో మనం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. కేంద్రీకృత ప్రభుత్వం, కేంద్ర బ్యాంకు విధానాలు ఉండొచ్చు. అయితే వికేంద్రీకరించిన సాంకేతిక సొల్యూషన్లకూ ప్రాధాన్యత ఉంది. తద్వారా ప్రతి ఒక్కరికీ ఆర్థికాన్ని అందుబాటులోకి తీసుకురావొచ్చు. రియల్ టైం సాంకేతికతతో అప్పటికప్పుడు లావాదేవీలు జరిగిపోతున్నాయి. ఐఓటీని వినియోగించి రియల్ టైం సాంకేతికత, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్, బ్లాక్ చెయిన్, స్మార్ట్ టోకెన్లను భౌతిక మౌలిక వసతులతో ఏకీకరణ చేస్తే, ఎవరూ ఊహించని విధంగా వికేంద్రీకరణ పద్ధతిలో ఆర్థిక రంగాన్ని మనం పునర్ నిర్వచించొచ్చు.
ఇదీ చూడండి:Cryptocurrency in India: క్రిప్టో కరెన్సీతో దేశార్థికానికి మేలెంత?