కార్మికులు, కర్షకులు, దినసరి కూలీలు, విక్రయ సిబ్బంది, చిన్న దుకాణదారుల జీవనోపాధిని కరోనా మహమ్మారి దెబ్బతీస్తోంది. వీరికితోడు కుర్చీల్లో కూర్చుని పనిచేసే తెల్ల చొక్కా ఉద్యోగులూ ఎంతోమంది సంక్షోభంలో కూరుకుపోయారు. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్, భౌతిక దూరాలవల్ల కొన్ని రంగాల ఉద్యోగులకు ఇంటిపట్టునే ఉండి పని చేసుకోవడం తప్ప, మార్గాంతరం లేకుండా పోతోంది. అమెరికాలో గతంలో 14.6 శాతం ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేవారు. కొవిడ్ ముంచుకొచ్చిన తరవాత అదనంగా 34.1 శాతం 'ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రం హోమ్)' విధానానికి మారారు. మొత్తంమీద అమెరికాలోని ఉద్యోగుల్లో దాదాపు సగంమంది ఆఫీసుకన్నా ఇల్లు పదిలమంటున్నారని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఈ నెలలో జరిపిన అధ్యయనం తేల్చిచెప్పింది. ఈ తరహా పని పద్ధతిని రిమోట్ పని విధానమనీ అంటున్నారు. అంతర్జాలం, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, వీడియో కాన్ఫరెన్సులు, 4జి, బ్రాడ్‌బ్యాండ్ వంటి సాంకేతికతలు రిమోట్ పద్ధతిని సుసాధ్యం చేస్తున్నాయి. అమెరికాలో రిమోట్ పని విధానంలో చేయదగిన పనుల్లో చాలాభాగం మున్ముందు విదేశాలకు మళ్లిపోవచ్చుననీ ఎంఐటీ చెబుతోంది. అమెరికా జాతీయ ఆర్థిక పరిశోధన సంస్థ ఈ నెలలోనే జరిపిన మరో అధ్యయనం ప్రకారం కంప్యూటర్, గణిత వృత్తులు, సమాచారం, విద్యాబోధన-అభ్యాసాలు, న్యాయసేవలు, వ్యాపార సంస్థల నిర్వహణ, ఫైనాన్స్, బీమా రంగాలు రిమోట్ పనికి అత్యంత అనువైనవి. రవాణా, గిడ్డంగులు, వ్యవసాయం, చేపల పెంపకం, నిర్మాణ రంగం, చిల్లర వర్తకం, అడవులు, బస, ఆహార సేవలు రిమోట్ పనికి వెసులుబాటు ఇవ్వని రంగాలు.
5జీ రావాల్సిందే
రిమోట్ పనివిధానం నూరుపాళ్లు విజయవంతం కావాలంటే అంతర్జాలం, సెల్యులర్ యంత్రాంగాలు మరింత సమర్థంగా పనిచేయాలి. 5జి రంగ ప్రవేశం చేశాక రిమోట్ పని ఎంతో వేగంగా, సునాయాసంగా జరిగిపోతుంది. భారతదేశంలో ఇప్పుడున్న బ్రాడ్‌బ్యాండ్, 4జి సెల్యులర్ నెట్‌వర్కులు రిమోట్ పని మోపుతున్న అధిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి అదనపు 4జి స్పెక్ట్రమ్ కేటాయించాలని ఐటీ, సాఫ్ట్‌వేర్ సంస్థల సంఘం 'నాస్కామ్' కేంద్ర టెలికమ్యూనికేషన్ల విభాగాన్ని, ప్రైవేటు టెలికాం ఆపరేటర్లను కోరింది. భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ వ్యాప్తి తక్కువగా ఉండటం, 4జి టవర్లలో కేవలం నాలుగో వంతుకే ఫైబర్ అనుసంధానత ఉండటం వల్ల ఇంటి నుంచి పని వేగంగా సాగడం లేదు. భారత్‌లో కానీ, అమెరికాలో కానీ గృహ వినియోగదారులు చందా కట్టి తీసుకునే బ్రాడ్‌బ్యాండ్ పథకాలు బాగా తక్కువ సామర్థ్యం కలిగిన వైఫై రూటర్లను అందిస్తాయి. ఇంట్లో పిల్లలు ఆన్‌లైన్ విద్యాభ్యాసం చేయడానికి, సినిమాలు చూడటానికి, పెద్దలు ఈ మెయిళ్లు పంపుకోవడానికైతే ఈ రూటర్ల సామర్థ్యం సరిపోతుంది. వీటితోపాటు ఆఫీసు పనులూ చేయాలన్నా, వీడియో కాన్ఫరెన్స్‌లలో పాల్గొనాలన్నా బ్యాండ్‌విడ్త్ సరిపోదు. లాక్‌డౌన్ కాలంలో కుటుంబ సభ్యులు అంతర్జాలంలో అదేపనిగా గేమ్స్ ఆడుతుంటే పనేం జరుగుతుంది? ఇది చాలదన్నట్లు అనేకానేక యాప్‌లు బ్యాండ్‌విడ్త్‌ను లాగేస్తాయి.
సంక్షోభం తర్వాతా కొనసాగింపు
కరోనా కల్లోల సమయంలో బ్యాంకులు, రిటైలర్లు, టెక్ కంపెనీల రిమోట్ ఉద్యోగుల నుంచి ఇంటర్నెట్‌కు తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. కొవిడ్ తరవాతా రిమోట్ పనివిధానం ఊపందుకుంటే టెలికాం, బ్రాడ్‌బ్యాండ్ సంస్థలు తమ సామర్థ్యాన్ని భారీగా పెంచుకోవాల్సిందే. అమెరికాలో టెక్ దిగ్గజాలు ఇదే పనిలో ఉన్నాయి. లాక్‌డౌన్ కాలంలో ఫేస్ బుక్, వాట్సాప్, మెసెంజర్‌లలో వీడియో పోన్ కాల్స్, వీడియో సందేశాలు రెట్టింపయ్యాయి. అంతర్జాలం ద్వారా సమావేశాలు, పనులు జరుపుకోవడానికి తోడ్పడే మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ వినియోగం ఒక్క వారంలో 40 శాతం పెరిగింది. కంపెనీల సొంత డేటా కేంద్రాలు రిమోట్ పని వల్ల అధికమైన ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాయి. అందువల్ల వాటిని మూసేసి అత్యంత శక్తిమంతమైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ డేటా కేంద్రాలను, క్లౌడ్ కంప్యూటింగ్ వేదికలను ఉపయోగించుకొంటున్నాయి. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్‌లపై వీక్షకుల ఒత్తిడి ఒక్కసారిగా పెరిగిపోవడంతో అంతర్జాలం వేగం మందగించింది. దాంతో ఆ కంపెనీలు వీడియో స్ట్రీమింగ్ నాణ్యతను తగ్గించాయి. తద్వారా అంతర్జాలంపై అధిక ఒత్తిడి లేకుండా జాగ్రత్తపడ్డాయి. కొవిడ్ సంక్షోభం వల్ల భారత్, అమెరికాలలో టెక్ కంపెనీల ఆదాయానికి గండిపడినా, సంక్షోభం ముగిశాక అవి మరింత బలోపేతమై వృద్ధి పథంలో రివ్వున దూసుకెళతాయి. కొవిడ్ ప్రభావంవల్ల వినియోగదారుల అలవాట్లలో వచ్చిన మార్పులు టెక్ కంపెనీల పాలిట వరాలుగా మారనున్నాయి.
భారత్‌లోనూ భారీ మార్పులు
భారతీయ ఐటీ-బీపీఓ రంగంలోని మొత్తం 43 లక్షల ఉద్యోగుల్లో దాదాపు 65 శాతానికి పైగా ఇప్పుడు ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. కరోనా బెడద తొలగిపోయిన తరవాత కూడా చాలా కంపెనీలు పూర్తిగా రిమోట్ పనివిధానాన్ని కొనసాగించవచ్చు. దీనివల్ల కార్యాలయాల అద్దెలు, రవాణా ఖర్చులు, వాహన కాలుష్యం, అన్నింటినీ మించి వ్యాపార నిర్వహణ ఖర్చులు బాగా తగ్గిపోతాయి. ఎనలిటిక్స్, బీపీఓ రంగాల్లో ఆఫీసు నుంచి పని చేసే ప్రతి ఉద్యోగిపై ఏటా సగటున వెచ్చించే ఖర్చు ఇంటి నుంచి పనిచేసినప్పుడు తగ్గుతోందని ఒక ఐటీ సంస్థ అధికారి వెల్లడించారు. ఇంటి నుంచి పని చేయడం మహిళా ఉద్యోగులకు ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. భారతీయ ఐటీ కంపెనీలు ప్రధానంగా విదేశీ క్లయింట్ల నుంచి కాంట్రాక్టులు పొందుతాయి. అంతర్జాతీయ బ్యాంకులు, బీమా సంస్థలు, ఆస్పత్రులు, ఫార్మా, విమానయాన కంపెనీలకే కాకుండా విదేశీ ప్రభుత్వాలకు సైతం మన ఐటీ సంస్థలు సాంకేతిక సేవలు అందిస్తున్నాయి. ఈ క్లయింట్ల ఆంతరంగిక వివరాలు బయటకు పొక్కకూడదు కాబట్టి, భారతీయ ఐటీ సంస్థలు పరిమిత సిబ్బందిని ఆఫీసు నుంచి పనిచేయడానికి వినియోగించి, మిగతా సిబ్బందిని ఇళ్ల నుంచి పనిచేయించవచ్చు. ఇందుకోసం విదేశీ క్లయింట్లను ఒప్పించే ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. 2025 సంవత్సరంకల్లా 25 శాతం ఉద్యోగులను మాత్రం ఆఫీసులకు రప్పించి మిగతావారిని రిమోట్ విధానానికి మార్చగలమా అన్నది అన్వేషిస్తున్నట్లు టీసీఎస్ సీఈఓ రాజేశ్ గోపీనాథన్ వెల్లడించారు. మొత్తం సిబ్బందిని ఆఫీసుకు రప్పించే అవసరం ఇక ఉండకపోవచ్చని ఆయన చెప్పారు. అదీకాకుండా కొవిడ్ వ్యాధి తగ్గినట్లే తగ్గి మళ్లీ తిరగబెడుతున్నందువల్ల లాక్‌డౌన్ ఎత్తివేసిన తరవాతా సిబ్బంది అంతా పొలోమంటూ ఐటీ కంపెనీలకు వచ్చే అవకాశాలు లేవు. లాక్‌డౌన్ తరవాత బెంగుళూరు ఐటీ కంపెనీలు మహా అయితే 50 శాతం ఉద్యోగులను కార్యాలయాల్లో పని చేయించవచ్చు. తదనుగుణంగా సీట్ల అమరికను మార్చే పని ఇప్పటికే మొదలుపెట్టాయి.
ఇదీ చదవండి:ప్రభుత్వ మద్దతు లేకుండా 'రిటైల్ పరిశ్రమ' మనుగడ కష్టమే!