ఈ రోజుల్లో డబ్బులు దాచుకోవడానికి, లావాదేవీలు చేయడానికి కొన్ని బ్యాంకులు మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని ఖాతాలు అందుబాటులోకి తెచ్చాయి. ఆ ఖాతాల ద్వారా షాపింగ్, పొదుపు వంటివాటి పరంగా ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. ముఖ్యంగా పలు బ్యాంకులు విమెన్ సేవింగ్స్ అకౌంట్లను అందిస్తున్నాయి. ఏదైనా నచ్చిన వస్తువు, దుస్తులు కనబడగానే కొనాలనుకుంటారు మహిళలు. అలాంటి వారికి ఈ ఖాతాలు ఎంతోగానో ఉపయోగపడతాయి. వీళ్లకోసం ప్రత్యేకంగా ఐ విష్ అకౌంటునీ అందిస్తోందో బ్యాంకు. అంటే మనం అనుకున్న వస్తువు తాలూకు ధరను నమోదు చేసి ఎన్నాళ్లలో కొనుక్కోవచ్చో వివరిస్తే... నెలకు కొంత మొత్తం మన జీతం నుంచి బ్యాంకు తీసుకుంటుంది. గడువుతేదీ ముగిశాక ఆ డబ్బు కొంత రివార్డులతో కలిపి మన చేతికి వస్తుంది. ఇలాంటి సదుపాయాలే మరికొన్ని బ్యాంకులూ అందిస్తున్నాయి. పెద్దవాళ్లకే కాదు.. పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకునీ ఈ పొదుపుఖాతాలు అందుబాటులోకి తెస్తున్నాయి బ్యాంకులు. ఆ వివరాలు తెలుసుకుని నచ్చినదాంట్లో పొదుపు దిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నించండి.
మీ వంతుగా ఎంత...
నెల తిరిగేసరికి జీతం తీసుకోవడం, ఖర్చుచేయడం మనలో చాలామంది చేసేదే. మరి అత్యవసర సమయంలో డబ్బు అవసరం అయితే... ఆ సమస్యకు పరిష్కారం మీ చేతుల్లోనే ఉందంటారు నిపుణులు. ఆదాయాన్ని అనుసరించి ముందు పదో, పదిహేను శాతమో పొదుపు చేశాకే ఖర్చుల గురించి ఆలోచించండి. మిగిలిన డబ్బుకు తగినట్లుగానే మీ అవసరాల గురించి ఆలోచించండి. దీర్ఘకాలం పొదుపు చేయగలిగితే ఎక్కువ మొత్తం కనిపిస్తుంది. ఇది సాధ్యం కావాలంటే వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం చాలా అవసరం. మీరేం చేయక్కర్లేదు. కొన్నాళ్లపాటు ప్రతినెలా దేనికి ఎంత ఖర్చుచేస్తున్నారనేది ఓ చోట రాయండి. నెల తిరిగేసరికి వృథా అనుకున్న ఖర్చుల్ని కొట్టేసి మరోసారి అవి చేయకుండా జాగ్రత్తపడండి. ఈ చిన్న ప్రక్రియ తెలియకుండానే ఎంతో డబ్బును మిగులుస్తుంది. ప్రయత్నించి చూడండి.
పిల్లలకు చెప్పడం కాదు...