Money saving ideas: డబ్బు సంపాదించడం కోసం అందరూ కష్టపడతారు. కానీ, ఆ డబ్బును పొదుపు చేసే విషయంలో మాత్రం కొద్దిమందే శ్రద్ధ చూపిస్తారు. అందుకే, వేతనం అందిన ఒకటి రెండు వారాల్లోనే మొత్తం డబ్బు ఖర్చయిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితికి చేరుకుంటారు. నిజానికి డబ్బు విషయంలో నిర్వహణపరమైన లోపమే ఇందుకు కారణం. దీన్ని అధిగమిస్తూ.. నెలనెలా పొదుపు మొత్తాన్ని పెంచుకునేందుకు పాటించాల్సిన సూత్రాలేమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
అలవాట్లకే అధిక మొత్తం..
ప్రతి వ్యక్తికీ కొన్ని అలవాట్లు ఉంటాయి. ఒకరు ఎప్పుడు ఏదో ఒకటి కొంటూనే ఉంటారు. మరొకరు బయట ఆహార పదార్థాలను భుజిస్తుంటారు. ఈ అలవాట్లు కొన్నిసార్లు వ్యసనాలుగానూ మారుతుంటాయి. వీటికే మన సంపాదనలో అధిక మొత్తం ఖర్చయిపోతుంటుంది. ఫలితం పొదుపు చేయడం సాధ్యం కాదు.. అప్పుల మీద ఆధారపడాల్సిన అవసరమూ వస్తుంది. ఒకసారి మీ అలవాట్లేమిటన్నది చూసుకోండి. వీటిలో వదిలించుకోవాల్సినవి ఏమిటో నిర్ణయించుకోండి. కొన్నాళ్లలోనే ఆ ఫలితం మీకు మిగులు మొత్తం రూపంలో కనిపిస్తుంది.
కొంత నేరుగా వెళ్లేలా...
ఆర్జించిన మొత్తంలో నుంచి నిర్ణీత శాతం పొదుపు చేసేలా ఏర్పాటు చేసుకోవాలి. వేతనం రాగానే ఇది జరిగిపోవాలి. మిగిలిన మొత్తం నుంచే ఖర్చులకు కేటాయించాలి. ఇప్పుడు బ్యాంకుల్లో వేతనం నుంచి కొంత మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్లకు కేటాయించే వీలు కల్పిస్తున్నాయి. మీ బ్యాంకు ఆన్‌లైన్ ఖాతాలో ఈ వివరాలు ఉంటాయి. పరిశీలించండి. పొదుపు ముందు.. ఖర్చు తర్వాత అనే సూత్రాన్ని ఎప్పుడూ విస్మరించవద్దు.
24 గంటల తర్వాతే..