రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నగదు ముద్రించి నేరుగా ప్రభుత్వానికి రుణాల కింద ఇచ్చే వీలుంది. అసలే ప్రత్యామ్నాయమూ లేదని అనుకుంటే మినహా, ప్రస్తుత పరిస్థితుల్లో అలా చేయకపోవడమే మంచిదని ఆర్‌బీఐ(RBI) మాజీ గవర్నరు దువ్వూరి సుబ్బారావు(Duvvuri Subbarao) పేర్కొన్నారు. ప్రభుత్వం నిధుల లోటును భర్తీ చేసుకునేందుకు పరిమిత వడ్డీ రేట్లపై రుణాలు సమీకరించే స్థితిలో లేనప్పుడు మాత్రమే ఆ మార్గం అనివార్యం అవుతుందని.. ప్రస్తుతం భారత్‌కు అలాంటి పరిస్థితి లేదనే అనుకుంటున్నానని అన్నారు.
కొవిడ్-19 రెండో దశ పరిణామాలతో నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు నిధుల సమీకరణ కోసం కొవిడ్ బాండ్ల మార్గాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించవచ్చని సూచించారు. ఇది అదనపు రుణ సమీకరణలా కాకుండా, బడెట్లో నిర్దేశించుకున్న రుణ సమీకరణలో భాగంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక స్థితిపై ఆయన ఏమన్నారంటే..
పరోక్షంగా అందిస్తోంది
'ప్రభుత్వానికి నిధుల కొరత ఏర్పడినప్పుడు నగదు ముద్రించి, రుణాల రూపంలో నేరుగానే ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వొచ్చు కదా అని అంటుంటారు. అయితే ఆర్‌బీఐ ఇప్పుడు కూడా నగదు ముద్రించి ప్రభుత్వానికి అప్పులిస్తుంటుందనే విషయం వాళ్లకు తెలియదు. ఎందుకంటే ఆర్‌బీఐ ఈ పనిని నేరుగా కాకుండా పరోక్షంగా చేస్తుంటుంది. ఉదాహరణకు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) కింద బాండ్లను లేదంటే ఫారెక్స్ ఆపరేషన్స్ కింద డాలర్లను ఆర్‌బీఐ కొనుగోలు చేస్తుంటుంది. ఈ కొనుగోళ్లకు చెల్లింపులు చేసేందుకు నగదు ముద్రిస్తుంది. ఈ డబ్బులు పరోక్షంగా ప్రభుత్వానికి రుణాలు ఇచ్చేందుకే. అయితే ఇక్కడో ముఖ్యమైన వ్యత్యాసాన్ని మనం గుర్తుంచుకోవాలి. నగదు లభ్యతను అందుబాటులోకి తేవడంలో భాగంగా ఆర్‌బీఐ చర్యలు చేపట్టినప్పుడు.. ఎంత నగదును ముద్రించాలి? ఎంత డబ్బును వ్యవస్థలోకి పంపించాలి? అనే విషయం ఆర్‌బీఐ చేతిలో ఉంటుంది.