మనీలాండరింగ్ కేసులో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందా కొచ్చర్ భర్త, వ్యాపారవేత్త దీపక్ కొచ్చర్‌కు.. ఈ నెల 19 వరకు రిమాండ్ విధించింది ముంబయిలోని ఓ కోర్టు. ఐసీఐసీఐ-వీడియోకాన్ కేసులో విచారణలో భాగంగా దీపక్‌ను ఈడీ సోమవారం అదుపులోకి తీసుకుంది.
అవకతవకలు...
వీడియో కాన్ గ్రూప్‌నకు రూ.1875 కోట్ల మేర రుణాల మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడ్డారంటూ చందా కొచ్చర్ దంపతులతో పాటు వీడియోకాన్ గ్రూప్‌నకు చెందిన వేణుగోపాల్ దూత్‌పైనా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద గతేడాది జనవరిలో ఈడీ క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఐసీఐసీఐ బ్యాంకు... చందా కొచ్చర్‌ను సీఈఓ పదవి నుంచి కూడా తప్పించింది. ఈ కేసులో నిందితులను పలుమార్లు విచారించిన ఈడీ.. తాజాగా దీపక్ కొచ్చర్‌ను అరెస్టు చేసింది. అలాగే, చందా కొచ్చర్ హయాంలో గుజరాత్‌లోని స్టెర్లింగ్ బయోటెక్ ఫార్మా కంపెనీ, భూషణ్ స్టీల్ గ్రూప్‌కు ఐసీఐసీఐ నుంచి రుణాలు మంజూరు చేయడంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపైనా ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఇదీ చూడండి:-'జీడీపీ పతనం ఆందోళనకరం- అప్రమత్తత అత్యవసరం'