దేశంలో మరో కొవిడ్ టీకా(Corona vaccine) పంపిణీకి కేంద్రం సిద్ధమవుతోంది. ఇప్పటికే కొవిషీల్డ్(Covishield), కొవాగ్జిన్(Covaxin), స్పుత్నిక్-వీ టీకాలను పంపిణీ చేస్తుండగా.. జులై 15 నుంచి మోడెర్నా టీకా(Moderna Vaccine) సైతం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
మోడెర్నా టీకా దిగుమతుల కోసం ప్రముఖ దేశీయ ఫార్మా సంస్థ సిప్లాకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ గతవారం అనుమతులు మంజూరు చేసింది. అయితే ఇందుకు కొన్ని షరతులు విధించింది. టీకా పంపిణీ చేపట్టిన తర్వాత తొలి 100 లబ్ధిదారులకు సంబంధించి 7 రోజుల ఆరోగ్య పరిస్థితిని సంస్థ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో.. మోడెర్నా టీకాల దిగుమతి ప్రక్రియను సిప్లా ప్రారంభించింది. ఈ వారం చివరినాటికి వీటిని దిగుమతి చేసుకోనుంది. ఆ తర్వాత ఆసుపత్రులకు కేటాయించేందుకు మరో వారం పట్టనుందని తెలుస్తోంది. జులై 15 నుంచి ఆయా ఆసుపత్రుల్లో ఈ టీకా పంపిణీ మొదలవనున్నట్లు సమాచారం.