కరోనా విజృంభిస్తున్న తరుణంలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాయి అన్ని దేశాల ప్రభుత్వాలు. దీనివల్ల ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎక్కువ సమయం ఇంట్లో ఉండడం వల్ల విసుగుచెందకుండా ఉండేందుకు అధికంగా ఫోన్లను వాడుతున్నారు. ఇందులో భాగంగానే ప్లేస్టోర్, యాప్స్టోర్లను ఉపయోగించి ఎక్కువగా గేమ్‌లను డౌన్లోడ్ చేస్తున్నారు. దీనివల్ల గేమ్‌ల డౌన్లోడింగ్ 20 శాతం పెరిగిందని వెల్లడించింది యాప్ ర్యాంకింగ్ డేటా. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే..20 శాతం పెరిగిందని, చివరి త్రైమాసికంతో చూస్తే ఇది 30 శాతంగా ఉందని తెలిపింది. ఈ విశ్లేషణ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 13 బిలియన్ల గేమ్‌లు
ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్లను ఉపయోగించి 13 బిలియన్ల గేమ్‌లను డౌన్లోడ్ చేశారు. ఇందులో అత్యధికంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి 10 బిలియన్ల గేమ్‌లు డౌన్లోడ్ అయ్యాయి. మిగిలిన 3 బిలియన్లు యాప్ స్టోర్‌ను ఉపయోగించి పొందారు.
భారత్, బ్రెజిల్‌లోనే అధికం
గూగుల్ ప్లేస్టోర్‌ను ఉపయోగించి ఎక్కువ శాతం భారత్, బ్రెజిల్‌లోనే గేమ్స్ డౌన్లోడ్ చేశారు. వీటిలోనూ అధికంగా పజిల్స్, సిమ్యులేషన్, యాక్షన్ వంటి శైలిలో ఉన్న ఆటల్నే ఎక్కువగా ఎంచుకున్నారు. యాప్ స్టోర్‌ను ఉపయోగించి చైనా, అమెరికాల్లో యాక్షన్, సిమ్యూలేషన్ శైలిలో ఉన్న వాటికి మొగ్గుచూపారు.