తెలంగాణ

telangana

ETV Bharat / business

'పెట్రో బాదుడుతో నిండుకుండల్లా ప్రభుత్వ ఖజానాలు​' - పెట్రోల్ ధరలు

దేశంలో 20 రోజులుగా పెట్రోల్​ ధరలు మండిపోతున్నాయి. సామాన్యులకు చుక్కలు చూపిస్తూ రోజుకో గరిష్ఠాన్ని తాకుతున్నాయి ఇంధన రేట్లు. ఈ విధంగా వచ్చిన ఆదాయం ఎక్కడకు వెళ్తోంది? ప్రభుత్వాలు ఎంత సొమ్ము వెనకేసుకుంటున్నాయి? వంటి విషయాలను ఆర్థిక నిపుణులు కృష్ణానంద్ త్రిపాఠీ.. ఈటీవీ భారత్​కు వెల్లడించారు.

Minting money: Centre's petroleum earnings doubled in five years
పెట్రోల్, డీజిల్​లతో ఖజానా నింపుకుంటున్న ప్రభుత్వాలు

By

Published : Jun 27, 2020, 6:50 PM IST

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్​ ధరలు రోజుకో గరిష్ఠాన్ని చేరుకుంటున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలను దాదాపు మూడు వారాలపాటు వరుసగా పెంచడంపై వినియోగదారుల నంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంధన ధరల పెంపు వల్ల సామాన్యుల జేబుకు మాత్రం చిల్లులు పడుతుంటే.. వచ్చిన లాభాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖజానాలో వేసుకుంటున్నాయి.

అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించే పూర్తి అధికారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఉంది. అయితే ఈ రేట్లలో మూడింట ఒక వంతు మాత్రమే ఆయిల్ కంపెనీల చేతికి వస్తుంది. మిగిలినదంతా పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకుంటాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం

దండుకుంటున్న ప్రభుత్వాలు!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చమురు రంగం ద్వారా వచ్చే ఆదాయం గత ఐదేళ్లలో 66 శాతం పెరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.5.5 లక్షల కోట్లను ప్రభుత్వాలు వసూలు చేశాయి. ఆదాయ పెరుగుదలలో కేంద్ర ప్రభుత్వ వాటానే అధికంగా ఉంది. గత ఐదేళ్లలో కేంద్ర ఆదాయం రెట్టింపు కాగా.. రాష్ట్రాల వసూళ్లు 38 శాతం పెరిగాయి.

అధికారిక గణాంకాల ప్రకారం పెట్రోలియం రంగం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆర్జించిన మొత్తం రూ. 3.33 లక్షల కోట్ల నుంచి రూ.5.55 లక్షల కోట్లకు చేరింది. 2014-15 నుంచి 2019-20 మధ్య కాలంలో 66 శాతం పెరుగుదల నమోదైంది.

అధిక ఆదాయానికి అనుమతులు

నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలిసారి పగ్గాలు చేపట్టాక.. చమురు ధరలు అతి తక్కువగా ఉన్నాయని, పెట్రోలియం ఉత్పత్తులపై ఆదాయం పెంచుకోవాలని నిర్ణయించారు. అలా చమురు రంగ ఆదాయంలో కేంద్రం వాటా 2014-15లో రూ. 1.72 లక్షల నుంచి 2019-20 నాటికి రూ. 3.34 లక్షల కోట్లకు ఎగబాకింది. ఇది 94 శాతం పెరుగుదల.

2014-15లో కేంద్రం సేకరించిన రూ. 1.72 లక్షల కోట్లలో రూ. 1.26 లక్షల కోట్లను ఆదాయ(రెవెన్యూ) రూపంలో... రూ. 46 వేల కోట్లను చమురు సంస్థల నుంచి డివిడెండ్, కార్పొరేట్ పన్నులు సహా ఇతర లాభాల రూపంలో ఆర్జించింది.

2019-20లో ఈ సంఖ్య 3.34 లక్షల కోట్లకు పెరిగింది. ఇందులో రెవెన్యూ వసూళ్లు రూ. 2.88 లక్షల కోట్లు కాగా... డివిడెండ్లు, కార్పొరేట్ పన్నులు, ఇతర ఆదాయాల రూపంలో రూ. 47 వేల కోట్లు కేంద్రం సేకరించింది. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పన్నులకు... ఆయిల్ సంస్థల నుంచి కేంద్రం పొందుతున్న డివిడెండ్లు వంటి ఇతర ఆదాయాలకు మధ్య భారీ తేడా ఉండటాన్ని గమనించాలి.

129 శాతం పెరుగుదల..

పెట్రోలియం రంగం నుంచి పన్నుల రూపంలో కేంద్రం ఆర్జిస్తున్న మొత్తం గత ఐదేళ్లలో రూ. 1.26 లక్షల కోట్ల నుంచి రూ. 2.88 లక్షల కోట్లకు చేరింది. అంటే పన్నుల ద్వారా వస్తున్న ఆదాయం 129 శాతం పెరిగింది. డివిడెండ్​ రూపంలో వచ్చే ఆదాయం మాత్రం స్థిరంగా ఉంది. 2014-15లో రూ. 46,040 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య... 2019-20లో రూ. 46,775కి చేరింది.

అయితే అంతకుముందు మూడు సంవత్సరాల్లో ఈ ఆదాయం సైతం గణనీయంగా నమోదైంది. 2016-17లో రూ. 61,950 కోట్లు, 2017-18లో రూ. 59,994 కోట్లు, 2018-19లో రూ. 68,194 కోట్ల ఆదాయాన్ని గడించింది కేంద్రం.

రాష్ట్రాల విషయానికొస్తే

పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్రాలకు చాలా కీలకం. రాష్ట్రాల ఆదాయ వనరులలో వీటిదే ప్రధాన వాటా. 2014-15లో పెట్రోలియం రంగంపై వ్యాట్ సహా సహజ వాయువు, చమురుపై రాయల్టీల రూపంలో రాష్ట్రాలు రూ. 1.6 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. 2019-20లో ఈ సంఖ్య రూ. 2.21 లక్షల కోట్లకు పెరిగింది.

ఇందులో అమ్మకపు పన్నులు/వ్యాట్​ వాటా రూ. 2.02 లక్షల కోట్లు కాగా... రాయల్టీల రూపంలో రూ. 11,882 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ(ఎస్​జీఎస్టీ) రూపంలో రూ. 7,345 కోట్లు వివిధ రాష్ట్రాల ఖజానాకు చేరాయి.

(రచయిత-కృష్ణానంద్ త్రిపాఠీ)

ఇదీ చదవండి-భారత అంకురాల్లో 12 రెట్లు పెరిగిన చైనా పెట్టుబడులు

ABOUT THE AUTHOR

...view details